సాక్షి, కొరుట్ల : ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’గా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లాలో మిల్లింగ్ చిచ్చు రేపుతుంది. జిల్లాలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలించడంపై అధికారులు తలోతీరుగా వ్యవహరించడం చర్చనీయమైంది. జిల్లాలో పండిన వరిధాన్యంలో సగానికి మించి మిల్లింగ్ కోసం పొరుగున ఉన్న జిల్లాలకు సరఫరా చేయాలని వారం క్రితం సివిల్‌సప్లయ్ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో స్థానిక రైస్‌మిల్లర్లకు నష్టమేకాకుండా ప్రభుత్వంపై రవాణాభారం పడుతుందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైస్‌మిల్లర్లు జిల్లాలోని ఓ కీలక అధికారికి విన్నవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మిల్లర్లతో ఓ కీలకాధికారి చేసిన వ్యాఖ్యలు జిల్లా రైస్‌మిల్ వర్గాల్లో చర్చనీయంగా మారడమే కాకుండా.. అధికారుల మధ్య సమన్వయలోపానికి అద్దంపట్టాయి.
ఇదీ సంగతి...
జగిత్యాల జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో జగిత్యాల జిల్లాలో సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పారాబాయిల్డ్, బాయిల్డ్ రైస్‌మిల్లులు కలిపి మొత్తం 95 వరకు ఉన్నాయి. వీటి మిల్లింగ్ సామర్థ్యం ఎంత తక్కువ అనుకున్న 2.80 లక్షల మెట్రిక్ టన్నులుగా రైస్‌మిల్లర్లు చెప్పుకొస్తున్నారు. అధికారులు మాత్రం జగిత్యాల జిల్లాలోని రైస్‌మిల్లర్లకు కేవలం 1,35,250 మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం మాత్రమే ఉందని నిర్ణయించారు. దీంతో మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్ చేయించాలని నిర్ణయించారు. స్థానిక రైస్‌మిల్లులకు సామర్థ్యం ఉన్నా.. ఇతర జిల్లాలకు ధాన్యం తరలించడంతో తమకు నష్టం జరుగడమే కాకుండా రూ.17కోట్ల మేర రవాణాభారం, సుమారు 5 వేల మంది కార్మికుల ఉపాధికి నష్టం జరుగుతుందని పేర్కొంటూ అధికారుల నిర్ణయంపై రైస్‌మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సమన్వయ లోపమేనా ?
పొరుగు జిల్లాల్లో ధాన్యం మిల్లింగ్ విషయంలో జిల్లాలోని రైస్‌మిల్లర్లు చేసిన వినతిని స్వీకరించిన కీలకాధికారి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపునకు కిందిస్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవడంపై రైసుమిల్లర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చెప్పిన కిందిస్థాయి సిబ్బంది నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారు. అధికారుల మధ్య సమన్వయలోపానికి అద్దంపట్టినట్లయింది. సమన్వయలోపంతోనే స్థానికంగా ఉత్పత్తి అయిన ధాన్యం పొరుగు జిల్లాలకు తరలుతుందనే అనుమానాలు రేకెత్తాయి. జిల్లాలోని రైస్‌మిల్లర్లలోనూ ఈ విషయం ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపుపై రైస్‌మిల్లర్లు తాజామాజీ ఎమ్మెల్యేలతో మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment