
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మానుకొండూరులో అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ బంటి సక్సెస్ అయ్యింది. మత్తు మందు ఇచ్చి ఎలుగును బంధించిన అధికారులు చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం ఉదయం మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది. అనంతరం, వీధి కుక్కలు ఎలుగుబంటిని తరమడంతో అది పరుగులు తీసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో గ్రామస్తులు.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. అయితే అది చిక్కకుండా తప్పించుకుంది. మానకొండూరు చెరువువైపు ఉన్న పొదల్లోకి ఎలుగు పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ జరిపి.. మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు దానిని బంధించారు.