అదిగో పులి..ఇదిగో లెక్క
సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: ఒకప్పుడు అడపాదడపా కనిపించిన పులి.. ఇప్పుడు రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే పులి దాడిలో ఇద్దరు హతమైపోగా, రోజుకో చోట పులి సంచారం బయటపడుతోంది. తాజాగా బెజ్జూర్, వేల్పులగుట్టలో గుర్తించిన పులిపాదముద్రలు.. పెరిగిన పులుల సంచారానికి అద్దం పడుతున్నాయి. దీంతో అటవీ సమీప గ్రామాల్లో ‘అదిగో పులి అంటే.. ఇట్టే ఉలిక్కిపడే పరిస్థితులు నెలకొన్నాయి. పులుల జాడ, కదలికలను అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పులుల జాడ కనిపెట్టేది ఎలా..?
రోజుకు వందల కిలోమీటర్ల మేర సంచరించే పులుల అడుగులే వాటి ఆవాస పరిధి, సంఖ్య అంచనాకు ఉపయోగపడతాయి. ఇటీవల పులుల దాడులు, సంచారం పెరగడంతో వాటి కదలికలపై అప్రమత్తంగా ఉంటున్న అధికారులు.. పులుల జాడను ఎప్పటికప్పుడు కనుగొంటూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్క ల గ్రామస్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు.
పాదముద్రలే కీలకం
పాదముద్రల పరిమాణం, ఆకారాన్ని బట్టి వయసు, ఆడ, మగపులా అనేది నిర్ధారిస్తారు. ఆడపులి అడుగు త్రికోణంలా, మగపులిది చతురస్రాకారంలో ఉంటుంది. పొడినేలపై కంటే తడి, ఇసుక నేలపై పాదముద్రల గుర్తింపు సులువు. పాదముద్ర చుట్టూ నలువైపులా గీతలు గీసి వాటి కొలతలు తీసుకుని అంచనా వేస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు సంచరించే ప్రాంతాలను యానిమల్ ట్రాకర్లు, వాచర్లు, స్థానికులిచ్చిన సమాచారంతో గుర్తిస్తున్నారు.
విసర్జితాలు, చెట్లపై గీతలు
కొత్తగా అడవిలోకి వచ్చిన పులి సరిహద్దులను ఏర్పర్చుకునే క్రమంలో తన పరిధిలో అక్కడక్కడా మూత్రాన్ని వదులుతుంది. ఆ వాసనను బట్టే ఇక్కడ పులి ఉందని మరో పులి తెలుసుకుంటుంది. ఆడపులి తిరిగే పరి«ధి 20 – 30, మగపులి పరిధి 50–80 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అవి వదిలే విసర్జితాలు, తన ఆవాస పరిధిలో చెట్లపై గీసిన పంజా గీతలు, రాలిన వెంట్రుకలు పులులపై అంచనాకు ఉపకరిస్తాయి. (చదవండి: జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..!)
సీసీ కెమెరాలతో కచ్చితత్వం
నైట్‌విజన్ కలిగిన సీసీ కెమెరాలతో పులుల కదలికలను అటవీ అధికారులు రికార్డు చేస్తున్నారు. అడవుల్లోని నీటి కుంటలు, శాకాహార జంతువులుండే ప్రాంతాలు, పులి రాకపోకలు సాగించే చోట్ల సీసీ కెమెరాలు బిగించి జాడ కనుగొంటారు. వీటి ఆధారంగానే ఆడ, మగ, చిన్న, పెద్ద, గర్భంతో ఉందా అనేది తెలుసుకుంటారు. పులి పంజాకు ఇద్దరు బలైపోయిన నేపథ్యంలో టైగర్ కారిడార్‌లో కెమెరా ట్రాప్‌ల బిగింపు ప్రక్రియ ముమ్మరమైంది.
వేల్పులగుట్టలో పులి పాదముద్రలు
పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం–రెడ్డిగూడెం గ్రామాల మధ్య వేల్పులగుట్ట వద్ద మిర్చి తోటలో బుధవారం పెద్దపులి పాదముద్రలను రైతులు, అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నెల 5న అశ్వాపురం పరిధి కనకరాజుగుట్టపై పులి ఆవును చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడ్రోజులకు కిన్నెరసాని వాగు నుంచి పాండురంగాపురం అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు అడుగుల ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. అవి పెద్దపులి అడుగులేనని పాల్వంచ ఎఫ్డీఓ తిర్మల్‌రావు, రేంజర్ అనిల్‌కుమార్ నిర్ధారించారు. టేకుల చెరువు వద్ద కూడా పులి పాదముద్రలు కనిపించాయని, రైతులు, గిరిజనులు అడవి వైపు వెళ్లొద్దని సూచించారు.
రోజుకు వందల కిలోమీటర్ల మేర సంచరించే పులుల అడుగులే వాటి ఆవాస పరిధి, సంఖ్య అంచనాకు ఉపయోగపడతాయి. ఇటీవల పులుల దాడులు, సంచారం పెరగడంతో వాటి కదలికలపై అప్రమత్తంగా ఉంటున్న అధికారులు.. పులుల జాడను ఎప్పటికప్పుడు కనుగొంటూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్క ల గ్రామస్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు.
వాచర్లతో ట్రాక్ చేస్తున్నాం
పులుల కదలికలను వాచర్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దాడులు జరిగిన ప్రాంతాల్లో గుర్తించిన పాదముద్రల ఆధారంగా ఏ పులి అనేది అంచనా వేస్తున్నాం. అడవిలో ఏర్పాటుచేసిన వందకుపైగా సీసీ కెమెరాలతో వాటి సంచారాన్ని పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉంటున్నాం. – శాంతారాం, జిల్లా అటవీ అధికారి,ఆసిఫాబాద్
అమ్మో.. ఎలుగుబంటి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాళ్లపూసపల్లి రోడ్డులో బుధవారం ఎలుగుబంటి కనిపించిందనే సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి సంచారంతో భయపడుతున్న ప్రజలు ఎలుగుబంటి వచి్చందని తెలియడంతో ఉరుకులు, పరుగులు తీశారు. తాళ్లపూసపల్లి రోడ్డులో నరేశ్ అనే వ్యక్తి ఎలుగుబంటి కనిపించిందని స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మహబూబాబాద్ రూరల్ ఎస్సై సీహెచ్ రమేశ్‌బాబు, వార్డు కౌన్సిలర్ మార్నేని వెంకన్నతో పాటు పలువురు కర్రలు పట్టుకుని సమీప ప్రాంతాల్లో రెండు గంటల పాటు గాలించినా ఆచూకీ దొరకలేదు.