వరి విత్తనాల సబ్సిడీ పునరుద్ధరణ
గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలో వరి విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించారు.. గజ్వేల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.. ప్రస్తుతం కూడా వరి విత్తనాలపై రూ.2 కోట్ల సబ్సిడీ యథాతథంగా అందనున్నది. జిల్లాను జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి తొలగించడం వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు వరి విత్తనాలపై సబ్సిడీ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే సమస్య తీవ్రతను చాటడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గజ్వేల్‌లో నిర్వహించిన సమీక్షలో సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ఈ క్రమంలో ఆయన సబ్సిడీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై ‘న్యూస్‌లైన్’ కథనం..
వరి సాగులో జిల్లా రైతాంగానికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందువల్లే ఈ ప్రాంతం మెతుకుసీమగా ఖ్యాతికెక్కింది. మిగతా పంటలతో పోలిస్తే వ రికి ఎన్ని కష్టనష్టాలెదురైనా వరి పట్ల అన్నదాత మొగ్గు చూపుతున్నాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పంటకు జిల్లాను ‘జాతీయ ఆహారభద్రతా పథకం’ జాబితా నుం చి తొలగించడంవల్ల ప్రతి ఏటా ఇస్తున్న కొద్దో గోప్పో విత్తనాల సబ్సిడీకి మంగళం పాడటానికి ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది జిల్లాకు సుమారు 90వేల హెక్టార్ల లో వరి సాగైతే 36వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సి డీ కింద పంపిణీ చేశారు. ఈ లెక్కన రైతులకు రూ. 1.80 కోట్లకుపైగా సబ్సిడీ వర్తించింది.
ఈసారి 40వేల క్వింటాళ్ల వరి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని ల క్ష్యంగా నిర్ణయించారు. దీని ప్రకారం రైతులకు రూ.2కోట్ల సబ్సిడీ వర్తించనుండగా...ప్రభుత్వ నిర్ణయంతో రైతులంతా షాక్‌కు గురయ్యారు. ఈ విషయా న్ని ముందుగానే పసిగట్టిన ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో జిల్లాలోని వ్యవసాయశాఖపై రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఆ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన హుక్యానాయక్, ఇప్పటివరకు జేడీఏగా వ్యవహారించిన ఉమాహేశ్వరమ్మ గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సమస్యను విన్నవించారు.
ఈ వ్యవహారంపై వెంటనే స్పం దించిన సీఎం జిల్లాకు వరి విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో కలెక్టర్ ద్వారా వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదన వెళ్లింది. రెండుమూడు రోజుల్లో ఇది క్లియర్ అయ్యి సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ వర్గాలు‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించాయి.