- మళ్లీ రాజుకున్న ఆర్టీసీ విభజన సెగ
- ఉన్నతాధికారి తీవ్రంగాగాయపడడమే కారణం
- ఆయనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు
- విభజనపై త్వరగా తేల్చాలంటూ ఇద్దరు సీఎంలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఇంకా ఉమ్మడిగానే కొనసాగుతున్న ఆర్టీసీలో ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా సంచలనమే అవుతోంది. ఆంధ్ర-తెలంగాణ అధికారులు పరస్పరం ఎదురుపడితే మాటల యుద్ధం షరా మామూలే అవుతోంది. అయితే, అది ఇప్పుడు దాడుల స్థాయికి చేరుకుందా? అనే అనుమానాలు ఆర్టీసీలో రేకెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనపై పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు అందింది. దీంతో ఆర్టీసీలో మళ్లీ విభజన వేడి రాజుకుంది.
ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌లోని టాయిలెట్‌లో రీజనల్ మేనేజర్ ఒకరు అనుమానాస్పదస్థితిలో గాయపడడం సంచలనం కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ బస్‌భవన్‌కు వచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని టాయిలెట్‌లో గాయాలతో కుప్పకూలిన స్థితిలో ఉన్న ఆయనను గుర్తించిన సిబ్బంది తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి నాంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన తాను టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, మొహంపైన, కడుపులో పిడిగుద్దులు గుద్ది తలను బలంగా గోడకేసి కొట్టాడని పేర్కొంటున్నారు. ఆయనపై దాడి జరిగిందంటూ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు అందింది.
విభజన కోణంలో: ఆర్టీసీని వెంటనే విభజించాలంటూ కొద్ది రోజులుగా ఒత్తిడి పెరిగింది. ఇటీవల తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారీని కలసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేయగా, త్వరలో రెండు రాష్ట్రాల సీఎస్‌లో సమావేశమై చర్చిస్తానని హామీ ఇచ్చారు. నెలరోజుల్లో విభజన జరుగుతుందని స్వయంగా ఆర్టీసీ ఎండీ రెండురోజుల క్రితం ప్రకటించారు. మరోవైపు.. ఖమ్మం నుంచి ఏపీలో కలసిన పోలవరం ప్రాంతానికి చెందిన సీనియర్ ఈడీ ఆంధ్రప్రదేశ్‌కే చెందాలని తెలంగాణ అధికారులు, కాదు తెలంగాణకే కేటాయించాలని ఆంధ్రప్రాంత అధికారులు పట్టుబట్టడంతో ఆర్టీసీలో తీవ్ర గందరగోళం నెలకొంది.
అధికారుల కేటాయింపు అంశం ఎటూతేలకపోవడానికి ఇది కారణమైంది. ఇప్పుడు విభజనపై మరింత ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఆర్‌ఎం సత్యనారాయణ గాయపడిన అంశం కూడా అందులో చేరిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే రెండు రాష్ట్రప్రభుత్వాలు జోక్యం చేసుకుని అధికారులు, సిబ్బంది మధ్య ఉద్రిక్తతలు పెరగకముందే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.