సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం లేని ఆర్‌ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు), పీఎంపీ (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు)లను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. గ్రామాల్లో క్లినిక్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వహణకు అనుమతిస్తూ 2009లో జారీ చేసిన జీవో 1273ని రద్దు చేయాలని కోరుతూ హెల్త్‌కేర్ రీఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్ కుమార్ పిల్ దాఖలు చేశారు.
నైపుణ్యం ఉన్న వైద్యులు నిర్వర్తించాల్సిన విధులను ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నిర్వర్తిస్తున్నారని, వారిని నిరోధించాలని పేర్కొన్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ఇస్తున్న కమ్యూనిటీ పారా మెడికల్ సర్టిఫికెట్లను జారీ చేయకుండా ఆదేశించాలని కోరారు. వైద్య రంగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 50 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య మండలి, పారా మెడికల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, వీరి శిక్షణకు సంబంధించి ఎలాంటి రికార్డుల్లేవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment