► చెట్టును ఢీకొన్న కారు.. యువకుడి మృతి
సాక్షి, వేములవాడఅర్బన్, చందుర్తి, కోరుట్ల: అంతా బీటెక్ స్టూడెంట్స్.. తమలో ఓ స్నేహితుడి ఎంగేజ్‌మెంట్ అయింది.. త్వరలో పెళ్లి.. సరదాగా షాపింగ్ కోసం అంతా కలిసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. తుళ్లింతలు.. కేరింతల నడుమ హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్ చేశారు. గురువారం రాత్రి కోరుట్లకు తిరుగుముఖం పట్టారు. తక్కువ దూరం.. త్వరగా ఇంటికి చేరొచ్చని సిద్దిపేట–సిరిసిల్ల–వేములవాడ–కోరుట్ల రూట్‌ను ఎంచుకున్నారు. మధ్యలో అర్ధరాత్రి భోజనాలు ముగించుకుని తెల్లవారు 4.30 గంటల ప్రాంతంలో వేములవాడ శివారులోని మరిపల్లి దగ్గరకు చేరుకున్నారు. తెల్లవారుజాము కావడంతో అంతా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. కారు నడుపుతున్న యువకున్ని నిద్రమత్తు ఆవరించిందో.. టైరు పేలిందో తెలియదు గానీ.. ఒక్క క్షణంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
అంతా కోరుట్లవాసులే..
కారు ప్రమాదంలో మృతిచెందిన గట్ల రాజేష్‌తోపాటు గాయాలపాలైన యువకులంతా కోరుట్ల పట్టణంలోని రథాల పంపు ఏరియాకు చెందినవారు. రాజ్‌కుమార్(23), పసుల కిషోర్(22), శ్రీకాంత్(23), వంశీ(22), రాజేష్ వీరంతా హైదరాబాద్‌లో వేర్వేరు కళాశాలల్లో బీటెక్ చదువుతున్నారు. రాజ్‌కుమార్‌కు ఇటీవల ఎంగేజ్‌మెంట్ అయింది. త్వరలో పెళ్లి నిశ్చయించినట్లు సమాచారం. ఆ షాపింగ్‌తోపాటు దసరా షాపింగ్ కలిసి వస్తుందని అంతా కలిసి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుని గురువారం షాపింగ్ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉండే స్నేహితులకు షాపింగ్ చేసిన బట్టలు అప్పగించి కోరుట్లకు పంపమని చెప్పి తిరుగుపయనమైన క్రమంలో వేములవాడ వద్ద కారు ప్రమాదానికి గురైంది.
కొడుకును చూడకముందే
మృతుడు గట్ల రాజేష్ తండ్రి గణేష్ దుబాయ్‌లో ఉంటున్నాడు. సుమారు పది రోజుల క్రితమే గణేష్ దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ముంబాయిలో ఉండే పెద్ద కొడుకు అరుణ్ ఇంటి వద్ద ఆగి ముంబాయిలో గణేష్ నిమజ్జనం పూర్తయ్యాక కోరుట్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో చిన్న కొడుకు రాజేష్ కారు ప్రమాదంలో మృతిచెందిన సమాచారమందింది. దుబాయ్ నుంచి వచ్చి కొడుకు రాజేష్‌ను కళ్లారా చూడకపోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. శుక్రవారం రాత్రి వరకు రాజేష్ తండ్రి గణేష్ కోరుట్లకు చేరకోలేదని సమాచారం. బంధువులు ప్రమాదస్థలికి వెళ్లినట్లు తెలిసింది.
కోరుట్లలో విషాదం
రాజేష్ మృతిచెందడంతోపాటు కోరుట్లకు చెందిన రాజ్‌కుమార్ నడుముకు గాయమైంది. పసుల కిషోర్‌కు కాలు, చేయి విరిగింది. శ్రీకాంత్ తలకు గాయాలయ్యాయి. వంశీకి స్వల్ప గాయాలయ్యాయి. తమ పిల్లలు ప్రమాదం బారిన పడ్డారని ఉదయాన్నే సమాచారం రావడంతో కుటుంబసభ్యులు వేములవాడ వెళ్లారు.
కేసు నమోదులో జాప్యం
రెండు మండలాల సరిహద్దు గ్రామాల మధ్య ప్రమాదం జరగడంతో కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారు. ప్రమాదం జరిగిన స్థలానికి అర కిలోమీటరు పొడవు వరకు చందుర్తి పోలీస్‌స్టేసన్ బోర్డు ఉందంటూ వేములవాడ రూరల్ పోలీసులు, రెవెన్యూ పరిధిని చూసుకుంటే మర్రిపల్లి గ్రామంలో ఉంటుందన్న కిరికిరితో పోలీసులు వివరాలు, కేసు నమోదు చేయడంతో ఆలస్యం చేశారు. చివరకు వేములవాడ రూరల్ పోలీస్‌స్టేసన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.