
రహ‘దారి’ కష్టాలు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పరంధోళి గ్రామపంచాయతీ ప్రజలను రహదారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి...
- రోడ్లు తెగినా పట్టించుకోని అధికారులు
- 20 గ్రామాల వాసులకు ఇబ్బందిగా ప్రయాణం
- ఆందోళనలో పల్లె జనం
కెరమెరి : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పరంధోళి గ్రామపంచాయతీ ప్రజలను రహదారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాలి బాటే వారికి శరణ్యమైంది. సరిహద్దులోని తెలంగాణలోని పంచాయతీకి చెందిన ఆరు గ్రామాలతోపా టు మహారాష్ట్రకు చెందిన మరో 14 గ్రామాల ప్రజ లు ఇదే మార్గంలో మీదుగా ఆదిలాబాద్ వెళ్తారు. ఎక్కడిక్కడ రోడ్లు తెగిపోవడంతో వారి రాకపోకలు నిలిచి పోయాయి. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నార్నూర్, పరంధోళి మీదుగా జివితి, చంద్రాపూర్‌కు వెళ్లేది. రోడ్లు తెగిపోవడంతో 20 రోజులుగా బస్సు నిలిచిపోయింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పాలనలో ఉన్న పరంధోళి రోడ్డుకు మరమ్మతులు కరువయ్యాయి.
పనులకు ఆటంకం
ప్రతీ పనికి కెరమెరి, ఆదిలాబాద్ వంటి కేంద్రాల కు వెళ్లాల్సిన వారు వరద తెచ్చిన కష్టంతో ఇబ్బంది పడుతున్నారు. ఇరవై రోజులుగా రోజువారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. రోడ్ బౌండరీ అధికారుల దృష్టికి పలుమార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్లినా.. చేస్తాం, చేస్తాం అనే సమాధానాలతో సరిపెడుతున్నారని పరంధోళి సర్పంచ్ వామన్ తెలిపారు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు ప్రధాన రహదారికి రావాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవా ల్సి వస్తోందని పేర్కొన్నారు. అరకొరగా ఉన్న రోడ్డుపై వాహనాలు నడిచి కాలం వెళ్లదీస్తుంటే భారీ వరదల వల్ల రవాణా సౌకర్యానికి అనేక ఇబ్బంది పడుతున్నామని సరిహద్దు వాసులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి.. తాము పడుతు న్న ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.