ఖిలా వరంగల్ : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శివలింగయ్య పిలుపునిచ్చారు. 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 నుంచి 29 వరకు జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా వైద్యశాఖ అధికారులు, ఆటోరిక్షా డ్రైవర్లు, విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు, యువతకు అవగాహన, క్విజ్ పోటీలతో పాటు బైక్ ర్యాలీలు, హెల్మెట్ వాడకంపై అవగాహన, కళాబృందాలచే ఆటపాటలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో రోజుకు 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, 6 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని పేర్కొన్నారు.
నిమిషానికి ఒక యాక్సిడెంట్‌లో ఒక్కరు మృత్యువాత పడుతున్నారని చెప్పారు.. డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే సుమారు 90 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 23న జాతీయ రహదారి భద్రతపై కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ, ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు. 24న కిట్స్ కళాశాలలో ప్రైవేట్ విద్యాసంస్థల డ్రైవర్లకు అవగాహన, 25న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రహదారి భద్రతపై లఘుచిత్రాల ప్రదర్శన, కరపత్రాల పంపిణీ, వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
26న రవాణాశాఖ ఉప కార్యాలయం భవనంలో రక్తదాన శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన, 27న రహదారి భద్రతపై ఎఫ్‌ఎం రేడియో ద్వారా అవగాహన, మండలాల్లో ప్రచార రథాలు ప్రారంభం, వాహన తనిఖీలు, వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహ, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
28న రోడ్డు భద్రతపై ఆటోరిక్షా డ్రైవర్లకు అవగాహన, డ్రైవింగ్ లైసెన్సు మేళా, స్కూల్, కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి తల్లి దండ్రులు, డ్రైవర్లు, క్లీనర్లకు అవగాహన సదస్సులు ఉం టాయన్నారు. 29న ముగింపు వేడుకులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాణ రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను వినియోగించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపొద్దని సూచించారు.
హాజరుకానున్న సీపీ..
ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం 10.30 గంటలకు రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభమవుతాయని, ముఖ్యఅతిథులుగా సీపీ విశ్వనాథరవీందర్, డీసీపీ బి. వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ డి.మురళీధర్ రావు, టీఎస్‌ఆర్‌టీసీ రిజినల్ మేనేజర్ టి. సూర్యకిరణ్, ఆర్టీఏ మెంబర్ కాటారపు రాజు, రోడ్డు సేఫ్టీ ఫౌండర్ హైదరాబాద్ రీజియన్ అధికారి కె.వినోద్‌కుమార్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. వాహనదారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని డీటీసీ శివలింగయ్య కోరారు. ఈ సమావేశంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీటీసీ శివలింగయ్య
Comments
Please login to add a commentAdd a comment