రూ.100 కోట్ల చుక్క.. రూ.30 కోట్ల ముక్క..! | Rs. 100 crore Liquor sold on Dasara eve in Hyderabad | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల చుక్క.. రూ.30 కోట్ల ముక్క..!

Published Mon, Oct 2 2017 12:51 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Rs. 100 crore Liquor sold on Dasara eve in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మద్యం డీలర్లకు చివరి పండుగ కావడం.. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాపారం జోరుగా సాగింది. పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా రూ.350 కోట్ల వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2,146 వైన్స్, 850 బార్లు ఉన్నాయి. ఇవిగాక మరో 18 టీఎస్‌బీసీఎల్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి. వీటి ద్వారా సగటున లిక్కర్, బీర్‌ కలుపుకుని గరిష్టంగా లక్ష కేసులు విక్రయిస్తున్నారు.

తాజాగా దసరా పండుగ సందర్భంగా ఏకంగా 5.5 లక్షల కేసులు విక్రయించినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 3 లక్షల ఐఎంఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌) కేసులు, 2.5 లక్షల బీర్‌ కేసుల అమ్మకాలు జరిగాయి. శుక్రవారం మినహాయిస్తే వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడంతో మందుబాబులకు సైతం విశ్రాంతి దొరికింది. ఈ పరిస్థితిని మద్యం డీలర్లు సొమ్ముచేసుకుని పండగ చేసుకున్నారు.

అమల్లోకి కొత్త మద్యం పాలసీ..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దసరా పండుగ వరకు పాత పాలసీ అమల్లో ఉండటంతో డీలర్లు తమ వద్ద ఉన్న స్టాకును పూర్తిస్థాయిలో విక్రయించే లక్ష్యంగా వ్యాపారాన్ని సాగించారు. ఫలితంగా చివరి మూడు రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే రూ.100 కోట్ల వ్యాపారం జరగ్గా.. గ్రామీణ ప్రాంతాల్లో మరో రూ.250 కోట్ల అమ్మకాలు జరిగాయి.

చివర్లో ధరలకు రెక్కలు..
కొత్త పాలసీ అమల్లోకి వస్తుండటంతో డీలర్లు జాగ్రత్తగా వ్యాపారం సాగించారు. దసరా సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి భారీగా స్టాకును నిల్వ చేసుకుని అమ్మకాలు జరిపారు. సాధారణంగా డీలర్లకు గడువు ముగిసే సమయంలో స్టాకును వదిలించుకునేందుకు ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకే విక్రయాలు జరిపేవారు. కానీ ఈసారి దసరా కలసి రావడంతో ఎక్కువ ధరలకు విక్రయించారు. లిక్కర్‌ సీసా ఫుల్‌ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.200 వరకు పెంచేసి సొమ్ము చేసుకోవడంతో మందుబాబుల చేతిచమురు వదిలినట్లైంది.

రూ.100 కోట్ల చుక్క.. రూ.30 కోట్ల ముక్క..!
గ్రేటర్‌ హైదరాబాద్‌ చుక్క.. ముక్కతో తడిసిముద్దయింది. వరుస సెలవులు కలసి రావడంతో లక్షలాది మంది పల్లెబాట పట్టగా.. సిటీలో ఉన్నవారు మందు, విందులతో సందడి చేశారు. గ్రేటర్‌ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు.. మరో 500 బార్లలో శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు. సిటీ నుంచి ఇతర జిల్లాలకు తరలి వెళ్లిన వారు సైతం భారీగా మద్యం కొనుగోలు చేసి తమ వెంట తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. బీర్ల కంటే ఐఎంఎల్‌ మద్యానికే మందుబాబులు మొగ్గుచూపినట్లు తెలిపారు.

దసరా ధమాకా సేల్స్‌ పేరుతో బార్లలో రెండు పెగ్గులకు మరో పెగ్గు ఉచితం.. ఫుల్‌బాటిల్‌ కొనుగోలుపై మద్యం సేవించే గ్లాసు ఉచితం తదితర ఆఫర్లు కూడా అమ్మకాలను భారీగా పెంచాయి. మరోవైపు నగరంలోని సికింద్రాబాద్, జియాగూడ, చెంగిచెర్ల తదితర హోల్‌సేల్‌ మాంసం మార్కెట్లలో శని, ఆదివారాల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన మాంసం అమ్మకాలు జరిగినట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మటన్‌ కిలో రూ.550–650, చికెన్‌ కేజీకి రూ.180–200, చేపలు రూ.150–500 వరకు ధర పలుకుతున్నా సిటిజన్లు పండగ చేసుకోవడం దసరా స్పెషల్‌. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement