రైతుల రుణాలు రూ.1994 కోట్లు
- 4 లక్షల 31 వేల మంది లబ్ధిదారులు
- క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ
- రేపు ప్రభుత్వానికి నివేదిక
వరంగల్ : జిల్లాలో రైతుల రుణాలు రూ.1994 కోట్లుగా తేలింది. 4,31,179 మంది రైతులు బకాయి ఉన్నట్లు స్పష్టమైంది. ఇందులో రూ.లక్ష వరకు రుణం పొందిన రైతుల వివరాలు 5వ తేదీ వరకు తేలనున్నాయి. ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో జిల్లాలోని సహకార, వాణిజ్య, జాతీయ బ్యాంకులు రైతులకు ఇచ్చిన పంట, బంగారు రుణాల వివరాలు బ్యాంకుల వారీగా లీడ్ బ్యాంకుకు అందజేశాయి.
గత నెల 31వ తేదీ వరకే ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశించినప్పటికీ రుణాల లెక్కలు, జాబితా తయారీలో జాప్యం జరిగింది. బ్యాంకర్లు, అధికారుల వినతి మేరకు ఈ నెల 5వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు అవకాశం కల్పించారు. దీంతో మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా రైతుల రుణాలు రూ.1994కోట్లుగా తేలినట్లు లీడ్‌బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుల వారీగా రూ.లక్ష లోపు రుణగ్ర హీతల వివరాలపై కసరత్తు చేస్తున్నారు.
ఈ కసరత్తు చేపట్టిన తర్వాత రుణగ్రహీతల జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీ వల్ల అనర్హులను తొలగించేందుకు అవకాశం ఉంటుందని భావిం చారు. తాజాగా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన 1,632 మంది రైతులు బంగారు రుణాల కింద రూ.8కోట్లు రుణం తీసుకున్నప్పటికీ తమను రుణమాఫీ కింద అర్హులుగా గుర్తించి జాబితాలో చేర్చకపోవడంపై నిరస న వ్యక్తం చేశారు.
కురవి మండలం గుండ్రాతి మడుగులో తమ భూమిపై ఇతరులు రుణం తీసుకున్న విషయం, మృతుని పేర రుణం తీసుకున్న తీరు ఈ సందర్భంగా వెలుగు చూస్తున్నాయి. సామాజిక తనిఖీతో మరి కొన్ని లొసుగులు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారుల సహకారంతో సామాజిక తనిఖీ పూర్తి చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఇంకా ఈ పని పూర్తి కాలేదు. ఈనెల 5వ తేదీలోపు ఈ పనులన్నీ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
సామాజిక తనిఖీలు, లక్ష మేరకు పరిగణనలోకి తీసుకుంటే రుణాల మొత్తం కొంత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొంత మంది రూ.లక్ష కంటే ఎక్కువ రుణాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరికి లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తే మిగిలిన రుణాన్ని రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని భావిస్తున్నారు.