రూ.48వేల కోట్లతో రుణప్రణాళిక | Rs 48 thousand crore runapranalika | Sakshi
Sakshi News home page

రూ.48వేల కోట్లతో రుణప్రణాళిక

Published Sat, Dec 13 2014 2:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రూ.48వేల కోట్లతో రుణప్రణాళిక - Sakshi

రూ.48వేల కోట్లతో రుణప్రణాళిక

  • తెలంగాణకు నాబార్డు ప్రణాళిక సిద్ధం
  •  పంట రుణాలు రూ.25,780 కోట్లు
  •  వ్యవసాయ టర్మ్‌లోన్లు రూ.9.400 కోట్లు
  •  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రూ.5,554 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగంగా వచ్చే ఏడాది రూ.48వేల 176కోట్ల రుణం అవసరమవుతుందని జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అంచనా వేసింది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను రుణ ప్రణాళికను సిద్ధం చేసింది. గత సంవత్సర రుణప్రణాళిక కంటే ఈ సారి ప్రణాళిక మొత్తం 19శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మూలధన సమీకరణను వేగవంతం చేయడానికి ఈ రుణప్రణాళిక ప్రాధాన్యం ఇవ్వనుంది.

    ఇందులో పంట రుణాలకు రూ.25,780 కోట్లు, వ్యవసాయ టర్ము రుణాల కోసం రూ.9,400 కోట్లు (మొత్తంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.35,180కోట్లు), సూక్ష్మ , చిన్న, మధ్యతరహా సంస్థలకు రూ.5,554 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.7,441కోట్లు కేటాయించారు.

    వచ్చే ఆర్థిక సంవత్సరంలో చిన్ననీటి పారుదల, పశు పోషణ, కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉద్యాన వనాలు, పళ్లు, కూరగాయలు, పూల పెంపకం, మార్కెట్ ఆధారిత విత్తనోత్పత్తి, శీతల గిడ్డంగుల నిర్మాణం, పునరుత్పాదక సామర్ధ్యంగల వనరుల ద్వారా స్వల్ప వ్యయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును అభివృద్ధి కేంద్రీకృత రంగాలుగా నాబార్డు ఎంపిక చేసింది. శుక్రవారం జరిగిన రుణప్రణాళిక సదస్సు సందర్భంగా నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జిజీ మెమెన్ ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ సదస్సులో పాల్గొన్నారు.
     
    ఇవీ ... కేటాయింపులు

    జలవనరుల అభివృద్ధి కోసం రూ.667.80కోట్లు, భూముల అభివృద్ధికి రూ.317.63కోట్లు, వ్యవసాయ క్షేత్రాల యాంత్రీకరణకు రూ.1,338.95 కోట్లు, మొక్కల పెంపకం, హార్టీకల్చర్, సెరికల్చర్‌కు రూ.709.72కోట్లు, అటవీ, వృధా భూముల అభివృద్ధికి రూ.58.86కోట్లు, పాడిపరిశ్రమ అభివృద్ధికి రూ.1616.98కోట్లు, కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి రూ.507.14కోట్లు, గొర్రెలు, మేకల పెం పకం కోసం రూ.741.32కోట్లు, మత్స్య పరి శ్రమకు రూ.45.32కోట్లు, గిడ్డంగులు, మార్కెట్ యార్డుల అభివృద్ధి కోసం రూ.776.12 కోట్లు, దేశీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం రూ. 65.26కోట్లు, ఇతర పనులకు రూ. 2,544.98 కోట్లివ్వాలని అంచనా వేశారు.  మహ బూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో శీతల గిడ్డంగుల కొరత ఉన్నట్లు గుర్తించింది.
     
    రైతు బృందాల ఏర్పాటు

    భూమిలేని రైతులు, కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతుల కోసం నాబార్డు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,840 బృందాల (జాయింట్ ఫార్మింగ్ గ్రూప్స్)ను ఏర్పాటు చేయనుంది. ఈ సంఘాల ద్వారా వారికి రుణాలు అందించనుంది. చిన్నకారు రైతులు సైతం మార్కెట్ శ క్తులతో పోటీ పడే విధంగా చేయాలని నాబార్డు నిర్ణయించింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement