నేతన్నలకు రుణమాఫీ ఆశలు
► కొత్త మార్గదర్శకాలు జారీ
► రూ.5.65కోట్లతో రుణమాఫీ
► జిల్లాలో 876 కుటుంబాలకు ప్రయోజనం
► జీవో 20తో వెసులుబాటు
సిరిసిల్ల (కరీంనగర్): ఏడాదిన్నరగా ప్రకటనలకే పరిమితమైన నేతకార్మికుల రుణమాఫీ ఆశలు మళ్లీ చిగురించాయి. ఈమేరకు గతంలో జారీఅయిన జీవో 44ను మార్గదర్శకాలను సవరించి తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్20ని విడుదలచేసింది. దీని ప్రకారం జిల్లాలోని పవర్‌లూం కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ కానున్నాయి. రూ..5.65 కోట్లతో జిల్లాలో నేతకార్మికులకు రుణవిముక్తి కలుగుతుంది.
ఆరేళ్లుగా ఆశలు..
చేనేత రుణాల మాఫీకి 2010లో అప్పటి ప్రభుత్వం రూ.420 కోట్లు కేటాయించింది. పవర్‌లూం రంగాన్ని రుణమాఫీలోకి తీసుకోవాలని అప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ సీఎం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను కలిసి కోరగా.. వారు అంగీకరించారు. అరుుతే బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.118 కోట్లు మిగిలినా పవర్‌లూం రంగానికి రుణమాఫీ వర్తించలేదు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రుణమాఫీ ఇవ్వాలని చేనేత, జౌళిశాఖ అధికారులతో చర్చించి జీవో 44ను జారీ చేస్తూ రూ.5.65కోట్లు మంజూరుచేశారు.
డీఎల్‌సీ సమావేశమే తరువాయి..
గతంలో జారీచేసిన జీవో 44ప్రకారం రుణాలపై బ్యాంకర్లు వందశాతం చక్రవడ్డీ మాఫీ చేయాలి. బకాయిపడిన వడ్డీలో 75శాతం బ్యాంకర్లు భరించాల్సి ఉంది. మిగతా 25 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. 2014 మార్చి 31నాటికి ఉన్న రుణం విధించే వడ్డీని బ్యాంకర్లే భరించాల్సి ఉంది. అరుుతే బ్యాంకర్లు ససేమిరా అన్నారుు. దీంతో రుణమాఫీ వ్యవహరం మళ్లీ మొదటికొచ్చింది. మారిన మార్గదర్శకాల ప్రకారం జీవో 20 ద్వారా రైతు రుణమాఫీలాగే లక్షలోపు రుణాలను వడ్డీతో కలిపి మాఫీ చేయాలని నిర్ణయించారు. దీనిపై జిల్లాస్థాయిలో డీఎల్‌సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరగాల్సి ఉంది. ఈ నెల 11న డీఎల్‌సీ సమావేశం జరిగే అవకాశముంది.
సిరిసిల్లకే ఎక్కువ ప్రయోజనం..
జిల్లాలో నేతన్న వ్యక్తిగత రుణమాఫీ జరుగుతుంది. ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా రుణమాఫీ ఉంటుంది. గంగాధర, చొప్పదండితోపాటు సిరిసిల్ల నేతన్నలకు రుణమాఫీ వర్తిస్తుంది. సిరిసిల్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. రూ.లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయి.- ఎం.వెంకటేశం, జౌళిశాఖ ఏడీ