గజ్వేల్ : గజ్వేల్ నగర పంచాయతీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి పథకం కింద రూ.60 కోట్లను మంజూరు చేస్తూ ఆర్‌డీఎంఏ (రీజినల్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) నగర పంచాయతీకి అధికారికంగా లేఖను పంపారు. ఈ మేరకు నగర పంచాయతీ పాలకవర్గం శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యకు తెరదించేందుకు సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకురావాలని తొలుత భావించి. ఇందుకోసం రూ.150 నుంచి 200 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసిన సంగతి తెల్సిందే. అయితే సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు తేవడం వ్యయ భారమే కాకుండా ఈ పథకాన్ని నిరంతరంగా నడపటానికి కోట్ల రూపాయల కరెంట్ బిల్లులను మోయాల్సి వస్తుందని గుర్తించారు.
ఈ ప్రాంతం నుంచి జంట నగరవాసుల దాహార్తిని తీర్చడానికి పైప్‌లైన్ ద్వారా పరుగులు పెట్టడానికి సిద ్ధమవుతున్న ‘గోదావరి సుజల స్రవంతి’ పథకాన్ని ట్యాప్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఈ వ్యవహారం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడం.. ఫలితంగా సీఎం నుంచి ఆదేశాలు వెలువడడంతో అధికారులు పథకానికి అంచనాలు సిద్ధం చేశారు. నిత్యం 40 లక్షల లీటర్ల నీటిని నగర పంచాయతీకి ఈ పైప్‌లైన్ ద్వారా తీసుకురానున్నారు.
తొలుత షామీర్‌పేట ప్రాంతంలో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్‌ను ట్యాప్ చేయాలని భావించారు. కానీ తిరిగి నగర పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపేట వద్ద ఉన్న పైప్‌లైన్‌ను ట్యాప్ చేస్తే సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం లింగారెడ్డిపేట పైప్‌లైన్ ట్యాపింగ్‌తో పాటు నగర పంచాయతీలోని నాలుగు చోట్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ, భూములు సేకరణ తదితర పనుల కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసింది.
ఈ విషయాన్ని ఆర్‌డీఏంఎ నుంచి నగర పంచాయతీకి లేఖ రావడంతో శనివారం నగర పంచాయతీ పాలకవర్గం చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నేతృత్వంలో సమావేశమై పనులకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. తీర్మాన కాపీని ప్రభుత్వానికి అందిన వెంటనే.. తాగు నీటి పథకం పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’కి చైర్మన్ భాస్కర్, కమిషనర్ సంతోష్ కుమార్‌లు ధ్రువీకరించారు.
‘గోదావరి’ నీటి పథకానికి రూ.60 కోట్లు
Published Sat, Nov 15 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement