సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు త్వరలో రూ.800 కోట్లతో 50% సబ్సిడీపై పాడిగేదెలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
విజయ డెయిరీతోపాటు నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్ డెయిరీలకు పాలుపోసే 2.17 లక్షల మందికి పాడిగేదెలను పంపిణీ చేస్తామని, ఇప్పటికే సీఎం ఈ ఫైల్‌పై సంతకం చేశారని ప్రకటించారు. రైతులకు లీటరు పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకానికి ఏడాదికి రూ. 100 కోట్లు అందిస్తున్నామని, రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపునకు రూ.50 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ ఏడాది 80 కోట్ల చేపపిల్లలు..
ఈ ఏడాది 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారిగా 22 కోట్లు, గతేడాది 51 కోట్ల చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేశామని పేర్కొన్నారు. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
9 రిజర్వాయర్లలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకంతో సత్ఫలితాలు ఇచ్చిందని, ఈ ఏడాది మరిన్ని రిజర్వాయర్లలో రొయ్యల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు, బ్లూ రెవల్యూషన్ కింద హేచరీల ఏర్పాటుకు ముందు కొచ్చే వారికి రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 మొబైల్ ఫిష్ ఔట్‌లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
పశువైద్యశాలల్లో మరమ్మతులు
రాష్ట్రంలోని వివిధ పశువైద్యశాలల్లో సరైన వసతులు లేవని, మరమ్మతులు, విద్యుత్, పెయింటింగ్, ప్రహరీల పనులను పంచాయతీ రాజ్, పశుసంవర్థకశాఖ అధికారులు కలసి గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించే విధంగా త్వరలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment