ఉస్మానియా వర్సిటీలో సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహిస్తున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 21వ రోజు కూడా కొనసాగింది. సీఎం కేసీఆర్ ప్రకటన తో కార్మికుల్లో కొంత గందరగోళం నెలకొన్నా శుక్రవారం కూడా కార్మికులు ఉధృతంగానే నిరసనలు వ్యక్తం చేశారు. కొందరు కార్మికులు డిపో మేనేజర్లకు ఫోన్ చేసి విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో జేఏసీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరూ విధుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. కూకట్‌పల్లి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోరేటి రాజు విధుల్లో చేరుతున్నట్లు లిఖిత పూర్వకంగా డీఎంకు దరఖాస్తు సమర్పించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండ ఏక శిలా పార్కులో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భూపాలపల్లిలో విద్యా సంస్థలకు వెళ్లి కార్మికులు విద్యార్థుల మద్దతు కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిల పక్షనేతలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మద్దతు ఇస్తూ నల్లగొండ డిపో వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ నేతలు కొత్త బస్టాండ్ వద్ద సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఖమ్మం బస్టాండ్ వద్ద జేఏసీ, అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష చేపట్టారు. నార్కట్‌పల్లి డిపో డ్రైవర్ జమీల్ గుండెపోటుతో మృతి చెందటంతో ఆయన మృతదేహంతో డిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు.
మృతుడి కుటుంబసభ్యులకు చెరుకు సుధాకర్ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. దామరచర్ల మండలం నర్సాపురంలో రమావత్ దీప్లా అనే డ్రైవర్ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో కార్మికుల నిరసన కార్యక్రమాల్లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. అలాగే శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
వంటావార్పు..
సంగారెడ్డి బస్టాండ్ వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట డిపో వద్ద ఏర్పాటు చేసిన నిరసనసభలో సీపీఐ నేత చాడవెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మ తోటలో బస్సుల కోసం ఎలగందుల స్కూల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మెట్‌పల్లి డిపోవద్ద కార్మికులు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట గోదావరిఖని డిపో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
30న సభకు జనసమీకరణపై దృష్టి
ఈ నెల30 సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన జేఏసీ.. జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందుకు రాజకీయ పార్టీల సాయాన్ని కోరింది. కార్మికుల కుటుంబసభ్యులతో పాటు సాధారణ ప్రజలు, పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు శుక్రవారం మధ్యాహ్నం జేఏసీ నేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర నేతలతో చర్చించారు. జన సమీకరణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.
సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ భేషజాలకు పోతున్నందున అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా జన సమీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ బహిరంగ సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనేలా జేఏసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతించకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అశ్వత్థామరెడ్డి
రంగంలోకి విద్యార్థి సంఘాలు
ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడ్డు కున్నా శుక్రవారం రాత్రి విద్యార్థులు భారీ బహి రంగ సభ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచే సభకు ఏర్పాట్లు జరిగినా అనుమతిలేదంటూ పోలీసులు మైకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావటం జేఏసీకి ఉత్సాహాన్నిచ్చింది. ఇకపై ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు.
72 శాతం బస్సులుతిప్పాం
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎక్కువ సంఖ్య(72 శాతం)లో బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. శుక్రవారం 6,519 బస్సులు తిప్పామని, ఇందులో ఆర్టీసీ బస్సులు 4591 ఉండగా, ఆర్టీసీ అద్దె బస్సులు 1,928 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment