‘విలీనం’ కాకుంటే ఉద్యమమే | RTC employees steps towards strike | Sakshi
Sakshi News home page

‘విలీనం’ కాకుంటే ఉద్యమమే

Published Thu, Sep 5 2019 3:58 AM | Last Updated on Thu, Sep 5 2019 5:27 AM

RTC employees steps towards strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సిబ్బందికి వేతనాలు చెల్లించే స్థితిలో కూడా లేనంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీఎస్‌ఆర్టీసీ మరోసారి సమ్మె దిశగా సాగుతోంది. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన కార్మిక సంఘాలు వరసపెట్టి సమ్మె నోటీసులు జారీ చేస్తున్నాయి. 2017తో ముగిసిన వేతన సవరణ ఒప్పందాన్ని పునరుద్ధరించటంలో జరుగుతున్న జాప్యం కూడా కార్మికుల ఆగ్రహానికి కారణమవుతోంది. వీటితో పాటు అంతర్గత నియామకాలు, డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత లాంటి మరో 12 డిమాండ్లను కూడా పేర్కొంటూ సమ్మె నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ యూనియన్లు నోటీసులు ఇవ్వగా, గుర్తింపు పొందిన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ గురువారం నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మరో ప్రధాన కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటుండటంతో  ఆర్టీసీలో ఉద్యమ సంకేతాలు కనిపిస్తున్నాయి.  

అప్పట్లో నీళ్లు చల్లినా.... 
ఆర్టీసీలో ప్రధానంగా వినిపించే డిమాండ్‌ వేతన సవరణ. 2015లో సిబ్బందికి ప్రభుత్వం భారీ వేతన సవరణను ప్రకటించింది. అనూహ్యంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంత భారీగా ఇవ్వటం పట్ల కార్మిక సంఘాలే ఆశ్చర్యపోయాయి. ఒకేసారి ఆర్టీసీపై దాదాపు రూ.850 కోట్ల వార్షిక భారం పడటం, దానికి సరిపడా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీ కుదేలవుతూ ఇప్పుడు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. నాటి వేతన సవరణ ఒప్పందం 2017తో ముగిసింది. తర్వాత ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ప్రకటించకుండా 27 శాతం తాత్కాలిక భృతి ఇచ్చింది. రెండేళ్లు గడిచినా ఫిట్‌మెంట్‌ ఊసు లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ ఉమ్మడి రాష్ట్రంలోనే వినిపించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే అవకాశం ఉందన్న ఆందోళన కార్మికుల్లో ఇప్పుడు నెలకొంది. దీంతో సర్కారు అలాంటి నిర్ణయం తీసుకోకుండా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.  

లేకుంటే...పోరాట పంథానే... 
ప్రభుత్వంలో విలీనం చేయకుంటే పోరాట పంథా తప్పదని ఎంప్లాయీస్‌ యూనియర్, టీజేఎంయూ నేతలు రాజిరెడ్డి, హన్మంతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. గురువారం తమ కార్యాచరణను ప్రకటి స్తామని టీఎంయూ నేత థామస్‌రెడ్డి వెల్లడించారు. గుర్తింపు సంఘం టీఎంయూ ఒంటెద్దు పోకడ లకు వెళ్లకుండా అన్ని సంఘాలను కూడగట్టుకుని సంయుక్త కార్యాచరణకు దిగితేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి కార్మికులకు న్యాయం జరుగుతుందని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement