మిలియన్‌ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి | RTC JAC seeking Laxman and Kodandaram support | Sakshi
Sakshi News home page

మిలియన్‌ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి

Published Thu, Nov 7 2019 3:41 AM | Last Updated on Thu, Nov 7 2019 3:41 AM

RTC JAC seeking Laxman and Kodandaram support - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 9న తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌కు మద్దతు కోరడంతోపాటు సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం బీజేపీ, టీజేఎస్‌ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే మిలియన్‌ మార్చ్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీజేఎస్‌ నేతలను కోరామన్నారు. ఉద్యోగులను కూడా కలుస్తున్నామని, పెన్‌డౌన్‌ చేయాలని కోరుతామని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్క శాతం మంది కూడా జాయిన్‌ కాలేదన్నారు. జాయిన్‌ అయిన వారు 300 మంది కూడా లేరని, చేరిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు 20 మంది కూడా లేరన్నారు. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయాలనుకుంటే కేంద్రం ఆమోదం అవసరమన్నారు. తమ డిమాండ్లలో విలీనం ఒక్కటే కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలనే తదితర 26 రకాల డి మాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లపై చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ కోకన్వీనర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు. కోకన్వీనర్లు వీఎస్‌రావు, సుధ మాట్లాడుతూ.. సీఎం గడువు పెట్టి డకౌట్‌ అయ్యారన్నారు.  
 
భయాందోళనకు గురికావద్దు 
మేడ్చల్‌ రూరల్‌: కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని, గట్టిగా నిలబడాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి సూ చించారు. బుధవారం మేడ్చల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయ డం ఎవరి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్‌ వాస్తవా లు గ్రహించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం కోరారు. కాగా, మాజీ మంత్రి గీతా రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ తదితరులు మేడ్చల్‌ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement