
సాక్షి, సిటీబ్యూరో: లెక్కలేని పనిగంటలు..పగలు–రాత్రి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబుల్ డ్యూటీలు..అడుగడుగునా ట్రాఫిక్ వెతలు..కాలం చెల్లిన బస్సులు వెరసి తీవ్రమైన ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు వర్తిస్తున్న 8 గంటల పని విధానం తాము ఎప్పుడో మర్చిపోయామని, ఆ రోజు పరిస్థితిని బట్టి 10 నుంచి 15 గంటల వరకు కూడా పని చేస్తున్నామని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. పనిఒత్తిడి వల్ల వ్యాధుల పాలవుతున్నామంటున్నారు. సిబ్బందిని భర్తీ చేయకపోవడం...వేతన సవరణ లేకపోవడం..జీతాల చెల్లింపులో జాప్యంతో తాము అధ్వానమైన జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిటీలోని 29 డిపోల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు.
♦ ఆర్డినరీ బస్సులు 3 నిమిషాలకు ఒక కిలోమీటర్ చొప్పున, ఎక్స్‌ప్రెస్‌లకు రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున చాలా ఏళ్ల క్రితం కేటాయించిన సమయమే ఇప్పటికీ అమలు జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 3500 బస్సులు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అధికారుల అంచనా. కానీ ఒకప్పటి వాహనాల రద్దీకి, ఇప్పటి రద్దీకి ఎంతో తేడా ఉంది.
♦ గ్రేటర్‌లో వాహనాలు 55 లక్షలకు చేరుకున్నాయి. ఏటా కనీసం 2 లక్షల వాహనాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. కానీ కొత్త కాలనీలకు, కొత్త రూట్‌లకు బస్సులను నడపాల్సి వస్తుంది. దీంతో పద్మవ్యూహాన్ని తలపించే ఈ రద్దీలో పాతకాలం నాటి రన్నింగ్ టైమ్ ప్రకారం బస్సులు నడుపలేకపోతున్నట్లు ఆర్టీసీ కార్మికులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
♦ సనత్‌నగర్ నుంచి కోఠీ రూట్లో నడిచే 45వ నెంబర్ బస్సులు, పటాన్‌చెరు, కోఠి, దిల్‌సుఖ్‌నగర్ రూట్లో తిరిగే 9వ నెంబర్ బస్సులు, సికింద్రాబాద్ నుంచి బార్కాస్ వరకు వెళ్లే 2సి బస్సులు, సికింద్రాబాద్–ఆఫ్జల్‌గంజ్, కోఠి మార్గంలో నడిచే 40వ నెంబర్ రూట్లో, సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో తిరిగే 107వ రూట్ బస్సులు, మియాపూర్, పటాన్‌చెరు, కోఠి, ఎర్రగడ్డ నుంచి కూకట్‌పల్లి రూట్లో తిరిగే అన్ని బస్సుల్లో రన్నింగ్ టైమ్ కొరత తీవ్ర సమస్యగా ఉంది. మరోవైపు రన్నింగ్ టైమ్ కొరత కారణంగా పెద్దఎత్తున ట్రిప్పులు రద్దవుతున్నాయి. ప్రతి రోజు కనీసం 3000 ట్రిప్పులకు పైగా రద్దవుతున్నట్లు అంచనా. దీంతో కొన్ని వేల మంది ప్రయాణికులు రవాణా సదుపాయాన్ని కోల్పోతున్నారు.‘రన్నింగ్ టైమ్‌పైన శాస్త్రీయమైన సర్వే నిర్వహించి కచ్చితమైన సమయాన్ని నిర్ధారించాలి. రూట్‌ల వారీగా సమయాన్ని నిర్ధారిస్తే పని భారం తగ్గుతుంది. మెరుగైన రవాణా సాధ్యమవుతుంది.’అని చెప్పారు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్.
నిలిచిపోయిన నియామకాలు...
ఆర్టీసీలో 2011 నుంచి ఉద్యోగ నియామకాలు లేవు. అప్పటి నుంచి సుమారు 7000 మంది ఉద్యోగ విరమణ చేశారు.దీంతో ఉన్న సిబ్బంది పైనే పని భారం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు తదితర సిబ్బంది అంతా కలిసి 24 వేల మంది ఉన్నారు. బస్సులు నడిపేందుకు ఇప్పటికిప్పుడు కనీసం 2500 మంది అవసరం. సిటీ బస్సులు ఒకప్పుడు 35 వేల ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. కానీ ఇందుకు తగిన విధంగా సిబ్బంది మాత్రం పెరగలేదు. ‘డబుల్ డ్యూటీలు చేసిన వాళ్లకు డబుల్ వేతనాలు ఇవ్వాలి. కానీ డ్రైవర్‌కు రూ.650, కండక్టర్‌కు రూ.610 చొప్పున ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం.’ అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్ కూడా లభించడం లేదు, సెలవులు వినియోగించుకోకుండా విధులు నిర్వహించిన వాళ్లకు వాటిని నగదుగా మార్చుకొనే సదుపాయం ఉంది. కానీ 5 ఏళ్లుగా లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్ నిలిపివేశారు. 2017 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగలేదు. ‘‘ కనీసం న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నాం. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా విస్మరించింది.’’ అని బీహెచ్‌ఈఎల్ డిపోకు చెందిన కండక్టర్ లక్ష్మి విస్మయం వ్యక్తం చేశారు.
ఆలస్యంగా జీతాలు
సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీ నాటికి కార్మికుల జీతాలు వాళ్ల ఖాతాలో పడిపోతాయి. కానీ కొంతకాలంగా వారం రోజులు దాటినా జీతాలు లభించడం లేదు. తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూరుకొనిపోయింది. వివిధ రూపాల్లో ఉద్యోగులు పొదుపు చేసుకున్న సుమారు రూ.1500 కోట్లకు పైగా ఆర్టీసీ వినియోంచుకుంది. అయినప్పటికీ ప్రస్తుతం జీతాల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ‘‘ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.100 కోట్ల నుంచి రూ.110 కోట్ల వరకు అవసరమవుతా యి. విద్యార్ధుల బస్‌పాస్‌లపైన ప్రభుత్వం ఇవ్వాల్సి న రాయితీలు ఇచ్చినా చా లు మాకు సకాలంలో జీతాలు లభిస్తాయి..’’ అని హనుమంతు ముదిరాజ్ అభిప్రాయపడ్డారు.
రెస్ట్‌రూమ్‌లు లేవు
సిటీలో చాలాచోట్ల బస్సులు నైట్‌అవుట్ చేస్తాయి. కానీ డ్రైవర్‌లు, కండక్టర్‌లు నిద్రించేందుకు రెస్ట్‌రూమ్‌లు, పడకలు లేవు. చాలా ఇబ్బందికి గురవుతున్నాం. పటాన్‌చెరులో ప్రతి రోజు వందలాది బస్సులు ఆగుతాయి. అక్కడి రెస్ట్‌రూమ్‌లలో సరైన వసతులు లేక నిద్రకు నోచుకోలేకపోతున్నాం. తిరిగి ఉదయాన్నే బస్సు నడపవలసి రావడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాం. – విక్రమ్, డ్రైవర్
ఇదేం రన్నింగ్ టైమ్?
సికింద్రాబాద్ నుంచి చార్మినార్‌కు వెళ్లే సిటీ బస్సుకు కేటాయించిన సమయం 40 నిమిషాలు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా గంట దాటినా ఆ బస్సు గమ్యానికి చేరుకోవడం లేదు. దీంతో ఆ రూట్‌లో ఏడున్నర గంటలకు బదులు 11 నుంచి 12 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. ఈ ఒక్క రూట్ మాత్రమే కాదు. నగరంలోని సుమారు 1050 రూట్లలో ఇదే పరిస్థితి. నిర్ణయించిన రన్నింగ్ టైమ్ ప్రకారం బస్సులు నడపడం చాలా వరకు అసాధ్యంగా మారింది.
‘విశ్రాంతి’ లేదు
మహిళా కండక్టర్‌ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిపోల్లో రెస్ట్‌రూమ్‌లు లేవు. టాయిలెట్లు లేవు, బస్టేషన్‌లలో కూడా అదే పరిస్థితి. నాలుగేళ్ల క్రితం యూనిఫామ్‌లు ఇచ్చారు. ఇప్పటి వరకు యూనిఫామ్‌లు కూడా ఇవ్వలేదు. రాత్రి వేళల్లో రక్షణ ఉండడం లేదు. రాత్రి పూట 8 గంటల వరకు మహిళలకు డ్యూటీలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ అమలుకు నోచుకోవడం లేదు. 11 దాటినా ఇంటికి చేరుకోలేకపోతున్నాం. – జ్యోతి, కండక్టర్, కాచిగూడ
నిలిచిపోయిన గుర్తింపు సంఘం ఎన్నికలు
ఆర్టీసీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరుగుతాయి. గత సంవత్సరం ఆగస్టు 7వ తేదీ నాటికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘం గుర్తింపు గడువు ముగిసింది. గడువులోపు ఎన్నికలు నిర్వహించి కొత్త సంఘం ఎన్నుకొనేందుకు అవకాశం కల్పించాలి. కానీ ఏడాది దాటినా కార్మిక శాఖ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ఒక ప్రిసైడింగ్ అధికారిని నియమించారు. కానీ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు.