
రూరల్ సర్వీస్‌ను రద్దు చేయాలి
- ఆందోళనకు దిగిన జూ.వైద్యులు
దత్తాత్రేయనగర్/సుల్తాన్‌బజార్: పీజీ వైద్యులు రూరల్ సర్వీస్ చేయాలనే ప్రతిపాదనను తొలగించాలని ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం ఆస్పత్రిలో అత్యవసర సేవల మినహా అన్ని సేవలు బహిష్కరించి గేటు వద్ద బైఠాయించారు. జూడాలు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కమిటీలు వేసి కాలయాపన చేశాయని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూరల్ సర్వీస్ చేయాలనే నిబంధనను తొలగించి, పీజీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించాలన్నారు.
సుల్తాన్‌బజార్‌లో: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రుల్లోను జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. దీంతో వచ్చిన రోగులు ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం కోఠి డీఎంఈ కార్యాలయం ముందు జూడాలు బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సంఘీభావం తెలిపింది.
జూడాల తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రద్దు చేసినట్టు సంవత్సర కాలం గ్రామాల్లో పని చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్, టీచింగ్ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిమ్స్‌తో సమానంగా రెసిడెన్షియల్ విధానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు.