సమాన విద్యే సమసమాజానికి నాంది
* నల్లగొండ ఉపాధ్యాయ నేతలతో జరిగిన ‘సాక్షి’ సమన్వయ సదస్సులో వక్తలు
* విద్యారంగంలో ‘సాక్షి’ కృషి ప్రశంసనీయం: ఎమ్మెల్సీ పూల రవీందర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధిపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు.వారందరి ఆశలు నెరవేరి, అందరికీ సమాన విద్య అందినప్పుడే సమసమాజం సాధ్యమన్నది ‘సాక్షి’ విశ్వాసం. ఆ దిశలో అవసరమైన వార్తలు, వార్తా కథనాలు రాయడంలో ‘సాక్షి’ ఎప్పుడూ ముందుంటూనే వస్తోంది. ఈ క్రతువును మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా శనివారం నల్లగొండ పట్టణం రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో ఉపాధ్యాయ నేతలతో సమన్వయ సదస్సును ‘సాక్షి’ నిర్వహించింది.
ప్రముఖ కవి, రచయిత వేణు సంకోజు అధ్యక్షత వహించినఈ సదస్సులో పీఆర్‌టీయూ, యూటీఎఫ్, డీటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయూ, టీడబ్ల్యూటీఎఫ్, టీఎన్‌యూఎస్, టీఆర్‌టీయూ, పీఈటీ ఉపాధ్యాయుల సంఘం, టీయూటీఎఫ్, టీపీయూఎస్, టీపీఆర్‌టీయూ, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి, 2003 డీఎస్సీ పోరాట సాధన సమితి నేతలు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారినుద్దేశించిన మాట్లాడిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్... ప్రభుత్వ విద్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల కెరీర్ గెడైన్స్ తదితర పలు అంశాల్లో ‘సాక్షి’ చేస్తున్న కృషిని అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో, విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో మాట్లాడతానని ఆయన చెప్పారు. అన్ని యాజమాన్యాల కింద ఉన్న స్కూళ్లనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు అంగన్‌వాడీ పాఠశాలలను కూడా విద్యా శాఖ పరిధిలోనికి తెచ్చేందుకు కృషి చేయనున్నట్టు వివరించారు.
టీచర్ల సమస్యలపై ప్రభుత్వాల తాత్సారం
విద్యార్థులంతా ఒకే తరహా పాఠశాలల్లో చదివే రోజులు రావాలని సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళి ఆకాంక్షించారు. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యా సంబంధిత అంశాల్లో ‘సాక్షి’ భవిష్యత్తులో కూడా తన ఒరవడిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తుందని చెప్పారు. ‘‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు తాత్సారం వహిస్తున్నందునే పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.ఇవి విద్యాబోధన అంశంపై ప్రభావం చూపుతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేనాటికే ఆర్థిక, కుల, మత అంతరాలు, విద్యా విధానంలో లోపాలున్నాయి. వీటిని సరిచేసేందుకు వేసిన కొఠారీ కమిషన్ సిఫార్సులు నేటికీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం. తెలంగాణలో 32 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతుంటే 29 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సాక్షి పత్రిక ప్రారంభం నుంచే ఉపాధ్యాయుల సంబంధిత అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తోందని గుర్తు చేశారు. విద్యార్థులకు కెరీర్ గెడైన్స్‌తో పాటు భవితలాంటి ఉపయుక్త సమాచారం ఇవ్వడం ద్వారా విద్యా సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు.