17న వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఈ నెల 17వ తేదీన పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక న్యూటౌన్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు.
రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గట్టు రాంచందర్ రావు, హబీబుర్ రహెమాన్, నల్లా సూర్య ప్రకాశ్‌రావు, జనక్ ప్రసాద్, శివకుమార్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పార్టీ నాయకుల కమిటీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. మహానేత వైఎస్ సంక్షేమ, అభివృద్ధ్ది పథకాల లబ్దిదారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
హామీల అమలులో కేసీఆర్ విఫలం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యూరని ఎడ్మ కిష్టారెడ్డి ఆరోపించారు. మహానేత అమలు చేసిన పథకాలను రద్దు చేస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కేవలం 5 నెలల వ్యవధిలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూట గట్టుకున్నదని ఎద్దేవా చేశారు.
దళితుడిని సీఎం చేయలేదని, వ్యవసాయానికి 9 గంటల కరెంటు సరఫరా అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో పింఛన్‌దారులు, రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజల పక్షాన పోరాటం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు భీమయ్యగౌడ్, జెట్టి రాజశేఖర్, మహ్మద్ హైదర్ అలీ, మహ్మద్ వాజిద్ పాల్గొన్నారు.