సాక్షి, హైదారాబాద్ : బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త! తమ దేశంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసిన వారికి ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా అక్కడే పనిచేసేందుకు రెండేళ్ల వర్క్ వీసా ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం భారత్‌తోపాటు ఇంగ్లండ్‌లో పైచదువులు చదవాలనుకున్న ఇతర దేశస్తులకు శుభవార్త అంటున్నారు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆండ్రూ ఫ్లెమింగ్. టైర్–4 వీసాలో ఇటీవల ఇంగ్లండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాని వల్ల భారత విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రూ వెల్లడించారు.
సాక్షి: విద్యార్థులకు జారీచేసే టైర్–4 వీసాల్లో ఇంగ్లండ్ తాజా నిర్ణయం వల్ల భారతీయులకు ఎలాంటి లాభం కలుగుతుంది?
ఆండ్రూ: ఇది తప్పకుండా భారతీయ విద్యార్థులకు లాభించేదే. గతంలో వీసాల మంజూరులో కాస్త సంక్లిష్టత ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులు ఉన్నత విద్య తరువాత రెండేళ్ల వరకు అక్కడే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
సాక్షి: విద్యార్థులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందా?
ఆండ్రూ: తప్పకుండా! టైర్–4 వీసా ద్వారా మా దేశంలో ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ప్రతిభావంతులకి ఈ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
సాక్షి: ఎప్పటి నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది?
ఆండ్రూ: ఈ నిబంధన 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు వర్తిస్తుంది. ఈలోపు గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులకు అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నాం.
సాక్షి: ఈ ఆకస్మిక నిర్ణయం వెనక కారణాలేంటి?
ఆండ్రూ: వాస్తవానికి ఇది ఆకస్మిక నిర్ణయమేం కాదు. 2030 నాటికి 6 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు మా దేశానికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రంగంలో మేము 34 బిలియన్ పౌండ్లు మార్కెట్ సాధించాలన్నది మా ప్రణాళిక.
సాక్షి: లండన్‌లో ఉన్నత విద్యకు అనుకూలించే అంశాలేంటి?
ఆండ్రూ: ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్సిటీలు ఉన్నాయి. టాప్–10లో 3 వర్సిటీలు. టాప్–100లో 48 వర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సులోనూ మా దేశానికి చెందిన 16 వర్సిటీలు పాల్గొన్నాయి. మా వద్ద ఇండియన్ సెటిలర్లు అధికం. ప్రస్తుతం 15 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. కాబట్టి, కొత్త ప్రాంతంలో ఉన్నా.. పెద్దగా హోమ్ సిక్ ఉండదు.
సాక్షి: భారత్ నుంచి ఏ కోర్సులు చదివేందుకు వస్తున్నారు? ఇంతవరకు ఎన్ని వీసాలు మంజూరు చేసారు?
ఆండ్రూ: 2019 జూన్ వరకు బ్రిటన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 22,000గా ఉంది. 2008–09 నుంచి 2019 వరకు బ్రిటన్‌లో ఉన్న త విద్యను అభ్యసించిన విద్యార్థుల సంఖ్య 1,30,000కు చేరింది. వీరిలో అధికశాతం సైన్స్ విద్యార్థులే ఉండటం గమనార్హం. వీరినే సంక్షిప్తంగా స్టెమ్ (ఎస్‌టీఈఎమ్)గా లేదా ఎస్=సైన్స్, టీ=టెక్నాలజీ, ఈ= ఇంజినీరింగ్, ఎమ్= మేథమేటిక్స్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటిదాకా 5 లక్షల మంది భారతీయులకు విజిటింగ్ వీసాలు మంజూరయ్యాయి. 56,000 మంది నైపుణ్యం కలిగిన ఇండియన్లకు వర్క్ వీసాలు ఇచ్చాం.
సాక్షి: వర్క్ వీసా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ఆండ్రూ: ఇక్కడున్న ఉన్నత విద్యతోపాటు, ఉద్యోగానుభవం చాలా విలువైంది. ఇక్కడ పనిచేసిన అనుభవంతో వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది. తిరిగి ఇక్కడే పనిచేయాలనుకుంటే.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పకుండా వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
సంఖ్య పెరుగుతోంది..
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. మూడేళ్లుగా మా దేశంలో విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కేవలం 2018లోనే విద్యార్థుల సంఖ్య 42 శాతం వృద్ధి నమోదవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా మా ప్రభుత్వం తీసుకున్న రెండేళ్ల వర్క్ పర్మిట్ నిబంధన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను మరింత పెంచుతుంది.
– ఇండియాలో బ్రిటిష్ హై కమిషనర్ డొమినిక్ ఆస్క్విత్
Comments
Please login to add a commentAdd a comment