సాక్షి, సిటీబ్యూరో: భారీ మొత్తం తీసుకుని ఒకరి ఇంటిపై వేరే వారికి అక్రమంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) సృష్టించి ఇచ్చిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగితో పాటు అతడికి సహకరించిన వ్యక్తినీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2016లో అప్పటి రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఏదైనా ఓ ప్లాట్‌లో ఇల్లు కట్టిన తర్వాత ఇంటి నంబర్ ఇవ్వడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) జీహెచ్‌ఎంసీ క్రియేట్ చేస్తుంది. అందుకు గాను సదరు యజమాని సేల్‌డీడ్ తదితరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ జరిగి, అధికారులు అన్నీ సరిచూసిన తర్వాతే పీటిన్ కేటాయిస్తారు. రాజేంద్రనగర్‌లోని ప్రేమావతిపేటలో ఉన్న ఓ ఆస్తిపై కొందరి మధ్య వివాదం ఉంది.
దీనిని కాజేయాలని చూసిన ముగ్గురు బోగస్ పత్రాల సాయంతో రాజేంద్రనగర్ అధికారులను సంప్రదించి పీటిన్ కోసం దరఖాస్తు చేశారు. ఇది తిరస్కారానికి గురికావడంతో వీరు అల్వాల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్æ ఆపరేటర్‌గా పని చేస్తున్న జయ చంద్ర వెలగను సంప్రదించారు. రూ.లక్ష తీసుకున్న అతగాడు అక్రమంగా రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ సర్వర్‌లోకి చొరబడి ఆ ముగ్గురి పేరుతో ఆస్తి ఉన్నట్లు పీటిన్ సృష్టించి ఇచ్చాడు. ఇలా పొందిన పత్రంతో వారు సదరు స్థలాన్ని విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఆస్తి యజమాని రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2016లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ నేతృత్వం లోని బృందం దీన్ని దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌కు బాధ్యుడైన జయ చంద్ర వెలగతో పాటు అతడికి సహకరించిన నాగేంద్ర బాబులను శుక్రవారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment