ఇసుక మాఫియా.. మజాకా!
నిఘా పెంచడంతో గాడిదలపై అక్రమ రవాణా
జోగిపేట: సర్కారు ఒక్కడుగు ముందుకేస్తే.. దాన్ని అడ్డుకునేందుకు ఇసుక మాఫియా మూడు అడుగులు వేస్తోంది. మంజీర నది ఒడ్డును ఇప్పటికే పూర్తిగా ఊడ్చేసిన ఇసుక మాఫియా.. నది మధ్యలోని నాణ్యమైన ఇసుక తరలించేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచిన నేపథ్యంలో.. లారీలు, ట్రాక్టర్లను వదిలేసి గాడిదలను రంగంలోకి దించింది. వాహనాలు నది మధ్యలోకి వెళ్లలేక పోవ డం.. పోలీసు నిఘా ఎక్కువ అవడం మాఫియాకు తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో నది మధ్యలోకి వెళ్లి నాణ్యమైన ఇసుక తీసుకురావడంతోపాటు, ఎవరికీ కనిపించకుండా కొండలు, పొదలు, పంట పొలాల మధ్య నుంచి ఇసుక తరలించేందుకు గాడిదలను ఉపయోగిస్తోంది మాఫియా. ఇందుకోసం పొరుగు రాష్ట్రం నుంచి గాడిదలను, వాటి యజమానుల కుటుంబాలను రప్పించింది. ఒక్కో గ్యాంగ్ సగటున 20- 25 గాడిదలను వినియోగిస్తోంది. ఒక్కో గాడిద ట్రిప్పుకు 50 నుంచి 60 కిలోల ఇసుక మోస్తుంది. మెదక్ జిల్లా రాయికోడ్ మంజీర పరీవాహక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామం ఎల్గోయ్ వరకుఇదే పరిస్థితి. వందల సంఖ్యలో గాడిదల గుంపులు ఇసుకను తరలిస్తున్నాయి. గాడిదలు మోసుకొచ్చే నాణ్యమైన ఇసుక ట్రిప్పుకు రూ.800 చొప్పున గాడిదల యజమానులకు వ్యాపారులు చెల్లిస్తున్నారు.