ఇసుకాసురులు | sand mafia in nakkavagu | Sakshi
Sakshi News home page

ఇసుకాసురులు

Published Thu, Jun 19 2014 12:03 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఇసుకాసురులు - Sakshi

ఇసుకాసురులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నక్కవాగులో దొంగలు పడ్డారు...ఇష్టానుసారం తవ్వేసుకుంటున్నారు. ఈ ఇసుక మాఫియా  దెబ్బకు నక్కవాగు రూపమే మారిపోయింది. పటాన్‌చెరు మండలం కంజెర్ల నుంచి మొదలు కొని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్ పేట వరకు చొరబడిన అక్రమార్కులు వాగును తోడేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేరకు వాగును పూర్తిగా ధ్వంసం చేశారు.

అంతటితో ఆగక వాగుకు ఇరువైపులా ఉన్న ప్రైవేటు భూముల్లో ఇసుక మేటలు ఉన్నంత వరకు  కొనుగోలు చేసి ఇసుకను తోడేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలతో నక్కవాగు నామరూపాలు లేకుండా పోయింది. గూగుల్ చిత్రంలో పరిశీలిస్తే 10 ఏళ్ల కిందట గలగల సెలయేటీ నీళ్లతో పారిన నక్కవాగుకు ఇప్పుడు మాఫియా చేతిలో పడి  ఉనికే కోల్పోయింది.
 
ఈ వాగులో ఇసుక మొత్తం తోడేసిన అక్రమార్కులు తాజాగా వాగు గర్భంలోని మట్టిని తోడి...అదే వాగు నీళ్లతో ఫీల్టర్ చేసి ఇసుకను తీసి అమ్ముతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా  సాగుతున్న ఈ వ్యవహారం అంతా రెవిన్యూ అధికారులు, పోలీసుల అండతోనే సాగుతోంది. రోజుకు కనీసం 1000 ట్రాక్టర్ల ఇసుక సంగారెడ్డి పోలీసు స్టేషన్  ముందు నుంచి కలెక్టరేట్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లిపోతోంది. ఏ ఒక్క అధికారి కూడా ఇసుక లారీలను ఆపేందుకు ప్రయత్నించడం లేదు. ఇసుక ‘రవ్వలు’ కంట్లో పడతాయని సారోళ్లంతా కళ్లు మూసుకుంటున్నారు.  కళ్లు తెరిచే సరికి కాసుల గలగలలు కనిపిస్తున్నాయి. అందుకే ఇసుక దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా నిరాటంకంగా సాగుతోంది.
 
గ్రామ పంచాయతీల పేర నకిలీ వే బిల్లులు  
కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక దందాను తమకు ఆదాయంగా మలుచుకుంటున్నారు. ఇసుక రవాణా అడ్డుకోవాల్సిందిగా పోయి నకిలీ వే బిల్లులు ముద్రించి ప్రతి ఇసుక వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి పనుల పేరిట ఇసుక ఫిల్టర్ యాజమాన్యాలకు కొన్ని పంచాయతీలను వేలం వేసి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో మండలంలోని ఎనిమిది గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
 
అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడంతోపాటు  భవిష్యత్‌లో పర్యావరణం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తున్నా, అక్రమ తవ్వకాలు మాత్రం ఆగటం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వే బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణ సాగుతున్నా, అధికారులు పట్టించుకోవటంలేదు. జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఉండే సంగారెడ్డి ప్రాంతంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు.  
 
వందల అడుగల మేర గుంతలు
నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు కొందరు అక్రమార్కులు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక ఫిల్టర్ల నిర్వాహణ నిరాటంకంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే నక్కవాగుకు ఇరువైపుల వెలిసిన ఇసుక ఫిల్టర్లు రాత్రింబవళ్లు నడుస్తున్నాయి. మండలంలోని ఆరుట్ల, చిద్రుప్ప, బేగంపేట్, ఎర్దనూర్, బ్యాతోల్, గౌడిచర్ల, ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌తో పాటు హత్నూర మండలం గుండ్లమాచ్నుర్ శివారులో కూడా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తున్నారు.
 
వాగు చుట్టూ సుమారు 100 వరకు ఇసుక ఫిల్టర్లు రాత్రీపగలు తేడా లేకుండా నడుపుతూ నిర్వాహకులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ నిబంధనలన్నింటిని పక్కన పెడుతున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా ఆయా గ్రామ శివారులోని భూముల్లో వందల అడుగల మేర  పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ గుంతలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి.
 
గుట్టలుగా ఇసుక డంపింగ్‌లు
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుకాసురులు పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేస్తున్నారు. ఫిల్టర్లు నిర్వహిస్తున్న ప్రాంతాలకు సమీపంలో గుట్టల మాదిరాగా వేలాది టన్నుల ఇసుకను పోగు చేస్తున్నారు. ప్రొక్లయిన్‌లతో తవ్విన మట్టిని నక్కవాగు నీటితో కడిగి ఫిల్టర్ చేస్తున్నారు. తయారైన ఇసుకను లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రతీ రోజు వందలాది లారీలు ఫిల్టర్ ఇసుకను హైదరాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, సంగారెడ్డి, సదాశివపేట తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
ఫిల్టర్ల ద్వారా తయారైన ఇసుక విలువ లక్షల్లో ఉంటోంది. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది అక్రమార్కులు అధికారులకు మస్కా కొట్టి చీకటి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. ఇదంతా బహిరంగాగనే కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఇస్మాయిల్‌ఖాన్ చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్బ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే నక్కవాగు రూపు కోల్పోతుంది. వాగు పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement