ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా: ఏసీబీకి సండ్ర లేఖ
ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యానని ఆయన తెలిపారు. ఇక విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తానని ఆయన ఆ లేఖలో రాశారు.
కాగా, ఓటుకు కోట్లు కేసులో నోటీసులు జారీ చేసినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకటవీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమైందన్న సమాచారం అందడం వల్లే ఆయన ఇప్పుడు విచారణకు వస్తానని లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈసారీ స్పందించకపోతే ఆయన్ని నిందితుల జాబితాలోకి చేర్చాలని ఏసీబీ భావించడంతో ఇక తప్పనిసరిగా విచారణకు రావాల్సిందేనని ఆయనకు సలహాలు ఇచ్చారు.
వెంకట వీరయ్యను విచారించాలని భావించిన ఏసీబీ.. జూన్ 16న సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సండ్ర ఇంటి (208 క్వార్టర్) తలుపులకు నోటీసు అంటించారు. దీనికి సండ్ర తనకు వంట్లో బాగాలేదని, ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని లేదా ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ జూన్19న ఏసీబీకి లేఖ రాశారు. పది రోజులైనా ఏసీబీ ఎదుటకు రాలేదు. ఎక్కడ చికిత్స పొందుతున్నారో వెల్లడించలేదు. ఎట్టకేలకు బుధవారం నాడు తాను విచారణకు వస్తానంటూ ఏసీబీకి ఓ లేఖ రాశారు.