
సాక్షి, హైదరాబాద్: మొలాసిస్‌తో సారా కాయటం అన్నది ఎక్సైజ్ చరిత్రలో ఇప్పటివరకు లేదని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. ‘నాటుసారాకు కొత్త రెక్కలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. 2016 అక్టోబర్ నాటికే తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేశామంటూ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సుజ్ఞానపురంలో మాత్రమే 27 టన్నుల చక్కెర నిల్వలు పట్టుకున్నామని, నిరంతర నిఘాతో గుడుంబాను నియంత్రించామన్నారు. చక్కెర కర్మాగారాల నుంచి మొలాసిస్ బయటికి రావాలంటే ఎక్సైజ్ డీసీ అనుమతి తప్పనిసరని వివరించారు. రాష్ట్రంలో గుడుంబా నియంత్రణ కోసం ఇప్పటివరకు 94 పీడీ యాక్టు కేసులు, బైండోవర్లు పెట్టడం జరిగిందన్నారు.