సెనెటర్‌ శారమ్మ  | Barack Obama Gives Support To Sarah | Sakshi
Sakshi News home page

సెనెటర్‌ శారమ్మ 

Published Sun, Aug 9 2020 12:17 AM | Last Updated on Sun, Aug 9 2020 4:43 AM

Barack Obama Gives Support To Sarah - Sakshi

ఇంకా సెనెటర్‌ కాలేదు. కానీ అయ్యేలా ఉన్నారు. అవుతారు కూడా. మంచికోసం పోరాడాలి. మంచి దారిలో పెట్టాలి. మంచికి తోడు అవ్వాలి. ఇన్ని హోప్స్‌ ఉన్నాయి... ఒబామాకు శారా మీద. ఆ ఆశలే ఆమె గెలుపు. 

గొప్పగా అనిపిస్తుంది.. ఇక్కడి వాళ్లు ఎక్కడికో వెళ్లి అక్కడి రాజకీయాల్లో ప్రముఖులు అయిపోవడం. పారిశ్రామికవేత్తలైతే ‘తెలివుంది కనుక’ అనుకోవచ్చు. నటీనటులైతే ‘టాలెంట్‌ ఉంది కనుక’ అనుకోవచ్చు. ఇంకా ఏ రంగానికి ఆ రంగంలో ఎవరికి వారు కష్టపడితే సుప్రసిద్ధ ఎన్నారైలు అయిపోవచ్చు. కానీ మనవాళ్లు పాలకులుగా కూడా ఎదుగుతున్నారే! అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాలలో!! ప్రజలు ఎన్నుకుంటేనే ఎక్కడైనా సభల్లోకి ప్రవేశం.

మరి భారతీయులు.. దేశంకాని దేశంలో.. ఎలా చట్టసభల ప్రతినిధులు అవుతున్నారు? ఎలా అంటే.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి. అక్కడి ప్రజలకు సేవలు అందించి, సదుపాయాలను కల్పించి! వ్యాపారికి తెలివి, నటులకు టాలెంట్‌.. ఉన్నట్లే.. రాజకీయంగా ‘నాయకత్వ సమర్థత’ మనవాళ్లను నిలబెడుతోంది. యు.ఎస్‌.లోని మైన్‌ రాష్ట అసెంబ్లీకి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న 48 ఏళ్ల శారా గిడియన్‌.. మన భారతీయ సంతతి మహిళే. ఇప్పుడామె ఆ పై స్థానానికి పోటీ చేయబోతున్నారు. అమెరికన్‌ ‘సెనెటర్‌’గా!

సెనెటర్‌గా శారా అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శుక్రవారం మద్దతు ఇవ్వగానే (‘ఎండార్స్‌’ అంటారు ఇలా మద్దతు ఇవ్వడాన్ని) వెనువెంటనే ఆమె తరఫున పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆమె కొత్తగా ప్రచారం గానీ, పరిచయం కానీ చేసుకోవలసిందేమీ లేదు. డెమొక్రాట్‌ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడన్‌ కూడా శారాకు మద్దతు పలికారు. ఇద్దరు దిగ్గజాలు ఇటొకరు, అటొకరు ఉండి (ఒబామా, బైడన్‌) శారాను సెనెట్‌కు పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె పని తీరు మీద వారికున్న నమ్మకం, విశ్వాసం అది. 2012 లో మైన్‌ అసెంబ్లీలో దిగువ సభకు ఎన్నికయ్యారు శారా. అది ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం.

తర్వాత 2016లో అదే సభకు స్పీకర్‌ అయ్యారు. ఇప్పుడు మైన్‌ రాష్ట్రం నుంచి వాషింగ్టన్‌ వెళ్లేందుకు.. ప్రస్తుతం ఇదే రాష్ట్రం నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థిగా సెనెట్‌లో ఉండి, మళ్లీ పోటీ పడుతున్న సీనియర్‌ సెనెటర్‌ 67 ఏళ్ల సుజేన్‌ కాలిన్స్‌ను డీకొనబోతున్నారు! ఆమెపై గెలిస్తే అమెరికన్‌ సెనెట్‌లో శారా రెండో భారతీయ సంతతి సభ్యురాలు అవడం అటుంచి, సుజేన్‌పై గెలవడం పెద్ద విషయం అవుతుంది. ఈ ఏడాది నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న రోజే అమెరికన్‌ సెనెట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. సభ్యులకు ఆరేళ్ల పదవీ కాలం ఉండే సెనెట్‌.. ప్రతి ‘సరి’ సంవత్సరంలో ఎన్నికలకు వెళుతుంది. 

శారా తండ్రి ఇండియా నుంచి వెళ్లి యు.ఎస్‌.లోని రోడ్‌ ఐలాండ్‌ రాష్ట్రంలో స్థిరపడిన పిల్లల వైద్యుడు. నలుగురు పిల్లల్లో శారా ఆఖరి సంతానం. రోడ్‌ ఐలాండ్‌లోనే పెరిగింది. శారా తల్లి రెండో తరం ఆర్మేనియన్‌ సంతతి మహిళ. శారా అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ చేశారు. చదువు అయ్యాక ఓ సెనెటర్‌ దగ్గర ఇంటెర్న్‌గా ఉన్నారు. తర్వాత మైన్‌స్టేట్‌లోని ఫ్రీపోర్ట్‌ టౌన్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు! అరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పోలిస్‌ సంస్కరణలు, తుపాకీ సంస్కృతి నియంత్రణ.. వీటికోసం శారా చాలా కృషి చేశారు. ఇలాంటి వారు సెనెట్‌లో ఉంటే అమెరికాకు మంచి జరుగుతుందని ఒబామా తన ఎండార్స్‌మెంట్‌లో రాశారు. శారా సెనెటర్‌గా ఎన్నికైతే కమలా హ్యారిస్‌ తర్వాత సెనెటర్‌ అయిన రెండో భారత సంతతి మహిళ అవుతారు. శారా భర్త, ఆమె ముగ్గురు పిల్లలు ఫ్రీపోర్ట్‌లో నివాసం ఉంటారు. భర్త బెంజమిన్‌ లాయర్‌. 
భర్త, పిల్లలతో శారా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement