సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించారు.
మెట్రోపాలిటన్ కోర్టులో ‘సత్యం’ నిందితుల పిటిషన్
విచారణార్హతను ఈ నెల 15న తేల్చనున్న జడ్జి
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాదులు సోమవారం అప్పీళ్లు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం(సీఆర్‌పీసీ) సెక్షన్ 374 కింద వాటిని సమర్పించారు. కుట్ర పన్నామనేందుకు ఆధారాలేమీ లేవని, తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిందని మొరపెట్టుకున్నారు. తమ అప్పీళ్లను విచారణకు స్వీకరించాలని, శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. పిటిషన్లను పరిష్కరించే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లను పరిశీలించిన జడ్జి టి.రజని విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరు దోషులు అప్పీళ్లు దాఖలు చేయాల్సి ఉంది.