సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికలవేళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన కుటుంబీకుల ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) జప్తు చేసింది. రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ‘పట్నం రాజేందర్‌రెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ’పేరిట ఏడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా షాబాద్ ఎస్‌బీఐ శాఖలో రుణం తీసుకున్నారు. ఈ అప్పుకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, మంత్రి సతీమణి సునీత పూచీకత్తు ఇచ్చారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 9న రుణగ్రహీతకు నోటీసు జారీ చేసింది. బకాయిపడ్డ రూ.1.78 కోట్లను రెండు నెలల్లోపు చెల్లించాలని షరతు విధించినా స్పందన రాకపోవడంతో సొసైటీ ఆస్తులతోపాటు పూచీకత్తుదారు ఇంటి స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేయడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఎడ్యుకేషనల్ సొసైటీ లిమిటెడ్ పేరిట షాబాద్‌లోని వివిధ సర్వే నంబర్లలో మొత్తం 25 ఎకరాల భూమిని, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి పేరుపై వికారాబాద్ జిల్లా తాండూరు యశోదనగర్‌లో సర్వే నంబర్137/పి (ప్లాట్ నం.27/సీ పార్టు)లో ఉన్న వంద చదరపు గజాల విస్తీర్ణంలోని ఇంటిని జప్తు చేసింది
Comments
Please login to add a commentAdd a comment