వారిపై మీ ప్రతాపమేంటి? | SC, ST cases Investigation | Sakshi
Sakshi News home page

వారిపై మీ ప్రతాపమేంటి?

Published Fri, May 1 2015 3:59 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

వారిపై మీ ప్రతాపమేంటి? - Sakshi

వారిపై మీ ప్రతాపమేంటి?

సంగారెడ్డి క్రైం: జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోన్నా, ఊరూరా బెల్ట్‌షాప్‌లు కొనసాగుతున్నా పట్టింపు లేదా? అని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ... మద్యంపై ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకోని వారు మారుమూల గ్రామాలు, తండాల్లోని గిరిజనులపై గంజాయి సాగు చేస్తున్నారంటూ కేసులు బనాయించి జైళ్లకు పంపడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. గంజాయి సాగు చట్ట విరుద్ధమే అయినా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు.

ఎక్సైజ్ అధికారులు ఏనాడైనా గిరిజనులకు కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మానిటరింగ్ కమిటీ సభ్యుడు రవీందర్ నాయక్ మాట్లాడుతూ... అనవసరంగా గిరిజనులపై కేసులు నమోదు చేయడం మానుకోవాలని సూచించారు. నారాయణఖేడ్ వంటి గ్రామీణప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కల్హేర్, సిర్గాపూర్ పీహెచ్‌సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సంబంధం లేని వారిని సైతం పోలీసులు ఇరికిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పందిస్తూ... గిరిజన తండాల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా గంజాయి, సారా తయారీకి వ్యతిరేకంగా చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టే అంశం పరిశీలిస్తామన్నారు.

నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఆర్ రోడ్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని,  ఆమోదం రాగానే పనులు చేపడతామని తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకంలో బ్యాంకుల్లో జీరో అకౌంట్ ఉంటే ప్రోత్సాహక డబ్బులు రావడం లేదని సభ్యుడు వెంకటేశ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ జీరో అకౌంట్లను సేవింగ్ అకౌంట్లుగా మారుస్తున్నామని చెప్పారు.
 
పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ : ఎస్పీ సుమతి
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, ఇతర కేసుల విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఎస్పీ సుమతి తెలిపారు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయడంతోపాటు చట్టపరిధిలో విచారణ, పారదర్శకంగా దర్యాప్తు జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు శాఖ తరఫున ఎస్సీ, ఎస్టీలకు చట్ట పరిధిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ దయానంద్, ఆర్డీఓలు, డీఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement