సీట్లు ఖాళీ!
♦ కలెక్టరేట్‌లో సిబ్బంది కొరత
♦ 1990లో నాటి అవసరాల మేరకు సిబ్బంది సంఖ్య నిర్ణయం
♦ గత ఏడాదికాలంలో పదిమంది బదిలీ పనుల్లో తీవ్ర జాప్యం
గుంటూరు ఈస్ట్ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగుల కొరత పరిపాలన జాప్యానికి దారితీస్తోంది. జిల్లా పరిపాలనా బాధ్యత అంతా ఈ కార్యాలయం నుంచి నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో తొమ్మిది విభాగాలతో ఈ కార్యాలయంలో విధులు నిర్వహణ జరుగుతుంటుంది. అన్ని విభాగాల్లో జరిగే పని, ఫైళ్లు కీలకమైనవే ఉంటాయి. ఇక్కడ పనిలో జాప్యం జరిగితే ఆ ప్రభావం జిల్లాపై ఎక్కువే. ఈ కారణంగానే జిల్లా అధికారులు ఆయా విభాగాల్లో అనుభవం, ఎంత పని ఒత్తిడి అయినా తట్టుకునే సిబ్బందిని నియమించుకుంటారు.
కలెక్టర్ కార్యాలయంలో విభాగాలను ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్,జీ,హెచ్,ఎల్ సెక్షన్లుగా విభజించారు. ప్రతి విభాగంలో వివిధ రకాల పనులు నిర్వహించేందుకు సెక్షన్ సూపరింటెండెంట్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌లు పనిచేస్తుంటారు. జిల్లా అధికారులు తాము నిర్వహించాల్సిన పరిపాలన విధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తన విధానాలను ఈ శాఖ సిబ్బంది ద్వారా నిర్వహిస్తాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఏర్పడింది. అనేక సెక్షన్లలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి.
వీటిని భర్తీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులు సొంతంగా సిబ్బందిని తీసుకునే అవకాశం లేదు. దీంతో కలెక్టరేట్‌లో అత్యవసర ఫైల్స్‌కు సంబంధించిన పనులే ముందుకు నడుస్తన్నాయి. సాధారణ ఫైల్స్ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. కలెక్టరేట్‌లో 1990 వ సంవత్సరంలో అప్పటి అవసరాలకు ఎంతమేర సిబ్బంది అవసరమో నిర్ణయించారు. దీని ప్రకారం ముగ్గురు గజిటెడ్ క్యాడర్ సూపరింటెండెంట్లు, 11 మంది సీనియర్ అసిస్టెంట్‌లు, 24 మంది జూనియర్ అసిస్టెంట్‌లు విధుల్లో ఉండేవిధంగా అప్పటి అధికారులు, ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు.
ఇప్పటికీ అదే సంఖ్యలో సిబ్బంది కొనసాగుతున్నారు. గత సంవత్సరకాలంలో ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ప్రమోషన్‌లు, ఇతర కారణాలతో కలెక్టర్ కార్యాలయం నుంచి బదిలీ అయి వెళ్లారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఉన్న సిబ్బందితోనే పరిపాలన సాగిస్తున్నారు.
పెరిగిన పనిభారం మేరకు సిబ్బంది అవసరం
గత 17 సంవత్సరాల్లో జనాభా పెరిగింది. పట్టణాలు పెరిగాయి. ప్రభుత్వ పథకాలు, విధి విధానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది సంఖ్యను పెంచాల్సింది పోయి ఉన్న సిబ్బందిలోనే కొరత ఏర్పడింది. దీనికితోడు రాజధాని నిర్మాణం నేపథ్యంలో కలెక్టరేట్‌పై పనిభారం పదింతలైంది. ఈ కారణంగా కొన్ని సెక్షన్లలో సిబ్బంది రాత్రి ఒంటిగంట వరకు పనిచేస్తున్నారు. తీవ్రమైన పని ఒత్తిడికి తోడు సెలవు దినాల్లోనూ కొందరు సిబ్బంది పనిచేయాల్సివస్తోంది.
ఈ-కార్యాలయం ప్రారంభంతో పనులు వేగవంతం
కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాల్లో ఈ- కార్యాలయం ప్రారంభిస్తున్నాం. దానికి అవసరమైన అధునాతనమైన స్కానర్లు, కంప్యూటర్లను తెప్పి ంచాం. దీనివల్ల పనులు వేగవంతం అవుతాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లోనూ ఈ - కార్యాలయం ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం.
-డాక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా సంయుక్త కలెక్టర్-1