చిన్నారులతో చెలగాటం | school bus accident no one injured in medak district | Sakshi
Sakshi News home page

చిన్నారులతో చెలగాటం

Published Wed, Jun 17 2015 12:05 PM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

school bus accident no one injured in medak district

 నడుస్తుండగానే ఊడిన స్కూల్ బస్సు చక్రం
 -భయకంపితులైన చిన్నారులు
 -ప్రాణ భయంతో రోదనలు
 -తప్పిన భారీ ప్రమాదం
 -ఓవర్‌లోడే కారణం!
 -రవాణా శాఖ సర్టిఫికెట్ ఇచ్చిన మరుసటి రోజే ఘటన
 -విస్మయం కలిగిస్తున్న  అధికారుల తీరు
 గజ్వేల్: రోజూలాగే పిల్లలను ఎక్కించుకొని వస్తున్న స్కూల్ బస్సు చక్రం.. నడుస్తుండగానే ఊడిపోయాయి.. దీంతో ఒక్కసారిగా కుదుపు, భారీ శబ్దాలు.. ఏం జరుగుతుందో తెలియని చిన్నారులు భయకంపితులై గజగజ వణికిపోయారు.. చిన్న పిల్లలు రోదించారు.. డ్రైవర్ బస్సును నిలిపేయడం, ఆ సమయంలో రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ చిన్నారులంతా ఊపిరి పీల్చుకున్నారు. పలువురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం గజ్వేల్‌లో చోటుచేసుకున్నది. పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఏపీ 23వై 4510 బస్సు.. వర్గల్, జబ్బాపూర్, సింగాయపల్లి, చౌదర్‌పల్లి గ్రామాల నుంచి సుమారు 75 మందికిపైగా పిల్లలను ఎక్కించుకొని బయల్దేరింది. పట్టణంలోని కస్తూర్బా పాఠశాల వద్దకు రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడుమవైపు ఉన్న టైర్ ఊడిపోయింది. బోల్ట్ పగిలిపోవడంతో చక్రం బయటకు వచ్చింది. దీంతో బస్సుకు ఒక్కసారిగా కుదుపు. ఈ ఘటనతో పిల్లలంతా భయకంపితులయ్యారు. బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్తూ ఆగిపోయింది. కొన్ని క్షణాలపాటు ఏం జరిగిందో తెలియక చిన్నారులు కలవరపడ్డారు. కొందరు ప్రాణభయంతో గట్టిగా రోదించారు. ప్రమాదం నుంచి బయటపడ్డామని తెలుసుకొని ఊపీరి పీల్చుకున్నారు. సమయానికి బస్సుకు బ్రేకులు పడటం, ఈ సమయంలో ఆ మార్గం నుంచి వాహనాలేవీ రాకపోడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బస్సుడ్రైవర్ ఆంజనేయులు పాఠశాల నిర్వాహకులకు సమాచారమందించడంతో వేరొక బస్సును అక్కడికి పంపించారు. పిల్లలంతా దానిలో స్కూల్‌కు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని తమ పిల్లలను చూసుకుని కన్నీరు పెట్టుకున్నారు. కొందరు బస్సు నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ఓవర్‌లోడ్ కారణమా?
నిత్యం 35 నుంచి 40 మంది పిల్లలతో వచ్చే బస్సు మంగళవారం అందుకు భిన్నంగా 75 మందికిపైగా పిల్లలను ఎక్కించుకొని వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు చెబుతున్నారు.
ఆయా రూట్‌లో వచ్చే మరో బస్సు మొరాయించడంతో ఒకే బస్సులో పిల్లలను ఎక్కించటం కారణంగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. కానీ ఈ ఘటన జరిగిన సమయంలో 45మంది విద్యార్థులున్నారని విద్యాశాఖ అధికారులు, 36 మంది ఉన్నారని పోలీసులు చెప్పడం గమనార్హం. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
 క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చిన మర్నాడే..
చక్రాలు ఊడిపోయిన బస్సుకు సోమవారం రోజే రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం.. ఇది గడిచిన 24 గంటలకే బస్సు ప్రమదానికి గురికావడం విస్మయం కలిగిస్తున్నది. స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని రవాణా శాఖ ఓ వైపు ఊదరగొడుతుండగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే వారి డొల్లతనం బయటపడటం చర్చనీయాంశంగా మారుతున్నది. గతేడాది వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన మహావిషాదం తాలూకూ చేదు జ్ఞాపకాలు నేటికీ బాధిత కుటుంబాలను కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నిరసన వెల్లువెత్తుతున్నది.
 డీఈఓకు నివేదిక..
 ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన మర్నాడే ఘటన జరిగిందనే విషయాన్ని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ధ్రువీకరించారు. జరిగిన ఘటనపై డీఈఓకు నివేదిక ఇస్తామన్నారు.
 ఫిట్‌నెస్ లేని పది స్కూలు వాహనాల సీజ్
 సంగారెడ్డి టౌన్: ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే పిల్లల్ని చేరవేస్తున్న వివిధ పాఠశాలలకు చెందిన పది వాహనాలను సీజ్ చేశామని మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం పటాన్‌చెరులో నాలుగు, జహీరాబాద్‌లో నాలుగు, సంగారెడ్డిలో రెండు వాహనాలను సీజ్ చేశామని చెప్పారు.
 ఖేడ్‌లో 4 బస్సులు ..
మనూరు: నారాయణఖేడ్‌లో నాలుగు స్కూల్ బస్సులను మంగళవారం సీజ్ చేశారు. జహీరాబాద్ ఎంవీఐ గణేష్ బస్సులను స్వయంగా తనిఖీ చేశారు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ లేదని గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. బోధి పాఠశాలకు చెందిన రెండు, కాకతీయ, బ్రిలియంట్ స్కూళ్లకు చెందిన ఒక్కొక్క బస్సు సీజ్ అయిన వాటిలో ఉన్నాయి.
 
 ఎందుకింత నిర్లక్ష ్యం
 పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నం. పిల్లల భద్రతను మీకు అప్పగిస్తున్నం. వారి భద్రతను పట్టించుకోకుండా కెపాసిటీకి మించి పిల్లలను తీసుకెళ్లడం నిర్లక్ష్యమే. బస్సు టైర్లు బాగున్నాయా లేదా, ప్రమాదం జరిగే పరిస్థితులుంటే వాటిని బిగించడం లాంటి పనులు అస్సలు పట్టించుకోవడం లేదు.
 - కారింగుల సుదర్శన్‌రెడ్డి (పేరెంట్, సింగాయపల్లి)
 చాల భయమైంది
 నేను నాలుగో తరగతి చదువుతున్న. పొద్దున మా స్కూల్ బస్సులో అందరితోపాటు ఎక్కిన. మధ్యలో బస్సు సప్పుడు చేసుకుంటూ ఒక్కసారిగా ఆగింది. చాల భయమైంది. తరువాత మమ్ములను వేరే దానిలో బడికి తీసుకుపోయిండ్రు.
 -విఘ్నేష్(విద్యార్థి, సింగాయపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement