పాతంకుల్ పెళ్లి రోజని కొత్తంకుల్ వచ్చాడు
మాసాయిపేట బస్సు ప్రమాదంలో గాయపడి, యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారి రుచిత.. ఇద్దరి ప్రాణాలను కాపాడి తాను మాత్రం గాయపడింది. ఈ పాప బాగా చురుగ్గా ఉందని, మంచి ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల మిగిలినవారి కంటే త్వరగా కోలుకుంటోందని ఆస్పత్రి సిబ్బంది కూడా చెప్పారు. తనకు ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వస్తుందని ఆమె యశోద ఆస్పత్రిలో 'సాక్షి టీవీ'తో చెప్పింది. తాను మూడో సీట్లో కూర్చున్నానని, రైలు వస్తుండగా చూశానని తెలిపింది.
బస్సు అప్పటికే రైల్వే ట్రాకు మీద ఆగిపోయిందని, అంతలో డ్రైవర్కు ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడని చెప్పింది. ఇంతలో రైలు వస్తోందని తాము చెప్పినా అతను మాత్రం పట్టించుకోలేదని, రైలు వస్తున్న విషయం చూసి తాను తన పక్క సీట్లో కూర్చున్న సద్భావన్, మహిపాల్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికీలోంచి బయటకు తోసేశానని తెలిపింది. తన తమ్ముడు వరుణ్ను కూడా తోసేందుకు ప్రయత్నించినా, అతడు కిటికీలో పట్టలేదని వివరించింది.
ప్రమాదం జరిగిన రోజున తమకు ఎప్పుడూ వచ్చే డ్రైవరంకుల్ పెళ్లి రోజని, అందుకనే ఆయన కాకుండా కొత్త అంకుల్ను పంపారని రుచిత చెప్పింది. అతడు తాము చెబుతున్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని తెలిపింది.