కమలం కరసేవకుడెవరో..!
కొత్త సారథి కోసం అన్వేషణ
గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణే లక్ష్యం
జిల్లాల నేతకే ఇవ్వాలనే ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిపై చర్చ ప్రారంభమైంది. రాష్ట్రంలో పార్టీని విస్తరించడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఆగష్టు చివరి నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసి, అక్టోబర్‌లో గ్రామ, మండల, జిల్లా పార్టీ కమిటీల ఎంపికను పూర్తి చేయనుంది. ఆ తరువాత రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విస్తరించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం ఉండాలని అభిలషిస్తున్నట్టుగా బీజేపీ ముఖ్యనాయకుడొకరు వివరించారు. ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీకి ఉన్న బలం, విస్తరించకపోవడానికి కారణం, నేతల మధ్య విబేధాలు వంటివాటిపై జాతీయ నాయకత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీటిని బట్టి 2019 ఎన్నికల్లో తగిన సత్తాను చూపించగలిగే సారధి కోసం అన్వేషిస్తోంది.
నాయకుల మధ్య కొరవడిన సఖ్యత
రాష్ట్ర బీజేపీలో అగ్రనాయకుల మధ్య ఐక్యత కొరవడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన ముఖ్యనేతల్లో ఏ ఇద్దరి మధ్యా సరైన సఖ్యత లేదు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు గత దశాబ్ద కాలంగా ఎవరూ ఇక్కడ ఇమడలేకపోయారు. పాత నాయకుల మధ్యే విబేధాల ఉండడంతో కొత్తగా వచ్చిన నాయకులెవరూ ఇక్కడ ఇమడలేకపోతున్నారు. అగ్రనాయకులు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పార్టీ అధ్యక్షులుగా పనిచేయగా, పి.మురళీధర్‌రావు, డాక్టర్ కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రావు వంటి సీనియర్లు కీలకంగా పనిచేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీపై అంత సంతృప్తిగా లేరు. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ సారధ్యాన్ని ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే దానిపై చర్చ జాతీయస్థాయిలో ప్రారంభమైంది.
గ్రామీణ ప్రాంతానికే అవకాశం...
బీజేపీ రాష్ట్ర సారథులుగా ఇప్పటిదాకా పనిచేసిన వారంతా హైదరాబాద్‌కు చెందినవారే. కేవలం నగరానికి చెందిన నేతల సారధ్యంలో పార్టీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేకపోతున్నదని పలువురు వాదిస్తున్నారు. జిల్లాల నుంచి నేతకు పార్టీ సారధ్యాన్ని అప్పగిస్తే పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందని జిల్లాల నేతలు పేర్కొంటున్నారు. రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన పార్టీ నేతను అధ్యక్ష స్థానానికి తీసుకుంటే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని పలు జిల్లాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులు, పదాధికారులు, ముఖ్యనేతలతో జూలై 5న బెంగళూరులో కీలక సమావేశం జరుగనుంది. పార్టీ విస్తరణ, రాష్ట్ర నాయకత్వంపై మార్పు వంటి కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది.