- సింగరేణిలో అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టుతో ప్రారంభం
గోదావరిఖని: సింగరేణి 125 సంవత్సరాల చరిత్రలో మరో మైలురాయిని చేరుకోబోతున్నది. ఇప్పటివరకు 600 మీటర్ల లోతులోనే బొగ్గును వెలికితీయగా... భవిష్యత్‌లో వెయ్యి నుంచి 1,200 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును వెలికితీసేలా సింగరేణి అన్వేషణ విభాగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సింగరేణిలోనే మొదటిసారిగా కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్ గనిలో అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ పనులు నిర్వహించారు.
ఇప్పటివరకు 600 మీటర్ల లోతులో బొగ్గు ఉంటే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఒక టన్ను బొగ్గుకు ఆరు క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించేవారు. ప్రస్తుతం వస్తున్న అధునాతన యంత్రాలతో ఒక టన్ను బొగ్గుకు 12 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే అవకాశముంది.
ఈ నేపథ్యంలోనే భూగర్భంలో 600 నుంచి 1,200 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు కోసం కూడా అన్వేషణ మొదలైంది. ఇందుకోసం జేకే-5 డిప్‌సైడ్ బ్లాక్, ఆర్‌కే న్యూటెక్ డిప్‌సైడ్ బ్లాక్, వెంకటాపూర్ డిప్‌సైడ్ బ్లాక్, శ్రావణ్‌పల్లి-1 డిప్‌సైడ్ బ్లాక్‌లో కూడా అన్వేషణ పనులు కొనసాగుతున్నాయి.