వినయ.. విధేయ.. రామ! | The Selection Process was accelerated by TRS chief KCR | Sakshi
Sakshi News home page

వినయ.. విధేయ.. రామ!

Published Mon, Apr 22 2019 4:52 AM | Last Updated on Mon, Apr 22 2019 8:14 AM

The Selection Process was accelerated by TRS chief KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్ని జెడ్పీ, ఎంపీపీ పీఠాలను గెలిచే విధంగా పరిషత్‌ టికెట్ల పంపిణీ.. టికెట్ల కేటాయింపులో విధేయులకు పెద్దపీట.. తారక రామారావుపై ఈ ప్రణాళిక అమలు బాధ్యత.. ఇదీ టీఆర్‌ఎస్‌ వ్యూహం. అన్ని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో గులాబీజెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ విధేయులకే అవకాశాలు కల్పించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల పంపిణీలో పార్టీ విధేయతకు, సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ అమలు బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావుకు అప్పగించారు. పార్టీ కోసం పనిచేసేవారికి, మంచివాళ్లకు కచ్చితంగా అవకాశాలు వస్తాయనిపించేలా టికెట్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.

పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. తొలిదశ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పక్రియ మొదలవుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిషత్‌ ఎన్నికల గెలుపు వ్యూహంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. జెడ్పీలు, ఎంపీపీల వారీగా రిజర్వేషన్లను పరిశీలించి సంబంధిత కేటగిరిలో మంచిపేరు ఉన్నవారిని పోటీకి సిద్ధం చేయాలని సూచించారు. అవకాశాల విషయంలో ఎమ్మెల్యేలు విశాలంగా ఆలోచించాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌లోని కొత్త, పాతల నేతలందరినీ పరిగణనలోకి తీసుకుని అర్హులకు పదవులు వచ్చేలా చూడాలన్నారు. అర్హులకు అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలినవారిలోనూ పార్టీపై, ఎమ్మెల్యేలపై గౌరవం పెరుగుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  

పకడ్బందీ వ్యూహం ... 
పరిషత్‌ ఎన్నికలు అధికారపార్టీగా టీఆర్‌ఎస్‌కు కీలకమైనవని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంతృప్తస్థాయిలో ప్రజలకు చేరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం ఉండాలని కేసీఆర్‌ సూచించారు. అన్ని జెడ్పీలు, అత్యధిక సంఖ్యలో ఎంపీపీలను టీఆర్‌ఎస్‌  కైవసం చేసుకోవాలని, దీనికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. మంత్రులు జిల్లాలవ్యాప్తంగా సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఎంపిక విషయంలో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని, దీనికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక మొదలు అన్ని విషయాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ చైర్మన్‌ పదవులను గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రణాళిక అమలు బాధ్యతలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావుకు అప్పగించారు.

పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం విషయంలో కేటీఆర్‌ అన్నీతానై పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కొత్త, పాత నేతల మధ్య అంతరం లేకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామాలు, మండలాలవారీగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశాలను ఇప్పటికే పూర్తిచేశారు. తొలిదశ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సోమవారం నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారు. పరిషత్‌ ఎన్నికల బీఫారాల పంపిణీ ప్రక్రియను టీఆర్‌ఎస్‌ ఇప్పటికే మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌ ఇన్‌చార్జి ఎం.శ్రీనివాస్‌రెడ్డికి ఈ బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గాలవారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఖ్య ప్రకారం బీఫారాలను వారికి అందజేస్తున్నారు.

ఒక్కొక్కరుగా ఎంపిక...
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల ఎంపిక ప్రక్రియను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వేగవంతం చేశారు. జిల్లాలవారీగా విధేయులు, పార్టీ కోసం పని చేసినవారి పేర్లను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. ఆసిపాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్ద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్‌ పదవిని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ములుగు జెడ్పీ చైర్మన్‌గా కుసుమ జగదీశ్‌కు, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్‌గా ఎలిమినేటి సందీప్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. మరో ఐదారు జెడ్పీ చైర్మన్‌ పదవులపైనా స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement