రేవ్‌పార్టీలో అర్ధనగ్నంగా నృత్యాలు...
శామీర్‌పేట్: ఒకప్పుడు నగరాలకు పరిమితమైన రేవ్‌పార్టీలు ఇప్పుడు శివారు ప్రాంతాలకు మారుతున్నాయి. పోలీసుల దాడులు తప్పించుకోవచ్చని యువతీయువకులు ఈ ‘అడ్డాల’ను ఎంచుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి మండల పరిధిలోని తుర్కపల్లిలో వినియోగంలో లేని ఓ పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు చేసి 12 మంది యువతులు, 14 మంది యువకులను పట్టుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పౌల్ట్రీఫాంలో యువతులు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తుండగా యువకులు వారిపై నోట్లు వెదజల్లుతున్నారు. యువతీయువకులు పూటుగా మద్యం తాగి ఒళ్లు మరిచిపోయి ఉన్నారు. అక్కడ వ్యభిచారం జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
పోలీసులు పౌల్ట్రీఫాంలోంచి నాలుగు కార్లు, సెల్‌ఫోన్లు, రూ. 2 లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పచ్చని పల్లెసీమల్లో ఈ ‘పాడు పని’ ఏంటని గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. వినియోగంలో లేని పౌల్ట్రీఫాం అయితే ఎవరికీ అనుమానం రాదని, తమ గుట్టురట్టు కాదని రేవ్‌పార్టీ నిర్వాహకులు భావించారు. పౌల్ట్రీఫాంలో కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి దానిని లీజ్‌కు తీసుకొని ఈ ‘దందా’ను సాగిస్తున్నట్లు సమాచారం. పౌల్ట్రీఫాంలోని గదులను సుందరంగా తీర్చిదిద్దారు. రిసార్టులను తలదన్నేలా ఏర్పాట్లు ఉన్నాయి. నగరానికి శివారు ప్రాంతమైతే యువతీయువకుల రాకపోకలకు సులువుగా ఉంటుందని భావించి ఉండొచ్చు. రిసార్టులో ఉద్యోగాలు చేస్తున్న కొందరు గ్రూపులుగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల దాడులు రిసార్టుల్లో పెరగడంతో అడ్డాలు మార్చుకుంటున్నారు. ‘పార్టీ’ ల నిర్వాహకులు దేశంలోని కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను రప్పిస్తున్నారు. దీంతో పాటు నగరంలో ఉండే కొందరు నిరుపేద యువతులకు గాలం వేస్తున్నారు. డబ్బున్న యువకులు, వ్యాపారులను ‘దావత్’లకు ఆహ్వానించి తమ దందాను మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందగా సాగిస్తున్నారు. ఇటీవల మండలంలోని లియోనియా రిసార్ట్స్‌లో పోలీసులు ఓ భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 30 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లియోనియాలో పట్టుబడిన యువతుల్లో ముగ్గురు తుర్కపల్లి ఘటనలో కూడా దొరికిపోవడం గమనార్హం. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ‘చీకటి దందాల’ను అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.