2014 నేరాలు
గతేడాదితో పోలిస్తే జిల్లాలో పెరిగిన నేరాలు
విజృంభించిన రేవ్‌పార్టీ కల్చర్
‘కార్డన్ సెర్చ్’ ప్రవేశపెట్టిన సైబరాబాద్ పోలీసులు
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం
కూలిపనికి వెళ్లిన ఓ మహిళ తిరిగి ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు పార్క్‌లో హత్యకు గురై కనిపించింది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఈ నెల వికారాబాద్ గాంధీ పార్క్‌లో వెలుగుచూసింది ఈ ఉదంతం. ప్రొఫెసర్ గురుప్రసాద్ కుటుంబ కలహాలతో తన ఇద్దరు కొడుకులను పాశవికంగా హత్య చేసి మేడ్చల్‌లోని తన ప్లాట్‌లో గుంతతీసి పాతిపెట్టాడు. అనంతరం తానూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మొయినాబాద్ మండలంలోని పలు రిసార్టుల్లో ఈఏడాది వ్యభిచారం, రేవ్‌పార్టీలు వెలుగుచూశాయి. జనాన్ని హడలెత్తించిన చైన్‌స్నాచర్ శివను పోలీసులు శంషాబాద్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్‌లో నకిలీనోట్ల ముఠా కాల్పుల్లో కానిస్టేబుల్ కాకి ఈశ్వర్‌రావు మృత్యువాత పడ్డాడు. మంచాల మండలంలో చిన్నారి గిరిజ బోరుబావిలో పడింది. అధికారులు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. బాలిక బోరుబావిలోనే అసువులుబాసింది. అప్పుల బాధతో పలువురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా మొత్తంమీద జిల్లాలో.. 2014 సంవత్సరంలో నేరాలు పెరిగిపోయాయి.
వికారాబాద్: జిల్లా గ్రామీణ ఎస్పీ పరిధిలో 2013 సంవత్సరంలో 2351 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటివరకు 2450 కేసులు నమోదు అయ్యాయి. గతేడాది 70 హత్యలు చోటుచేసుకున్నాయి. వాటిసంఖ్య 8 తగ్గి 2014లో 62 హత్యలు జరిగాయి. గతేడాదిలో 11 దోపిడీ కేసులు నమోదవగా ఈ సంవత్సరం కూడా అంతే సంఖ్యలో నమోదయ్యాయి. 2013లో దాడి కేసులు 370 నమోదు కాగా ఈఏడాది వాటి సంఖ్య 427కు పెరిగింది. చోరీలు గతేడాదితో పోలిస్తే కొంతమేర తగ్గాయి. కిడ్నాప్ కేసులు గతేడాది 22, ఈ సంవత్సరం 34 నమోద య్యాయి. అత్యాచారం కేసులు 30 నుంచి 51కి పెరిగాయి. ఆత్మహత్యల కేసులు కాస్త తగ్గాయి. ఆసంఖ్య 306 నుంచి 285కు పడిపోయింది. దొమ్మి కేసులు గతేడాది 18, ఈఏడాది 2 చోటుచేసుకున్నాయి. మిస్సింగ్ కేసులు 113 నుంచి 162కు పెరిగాయి. ఇతర కేసులు 723 నుంచి 720కు తగ్గాయి. అట్రాసిటి కేసుల సంఖ్య 51 నుంచి 60కి పెరిగాయి.
పెరిగిన రోడ్డు ప్రమాదాలు..
గతేడాది 163 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవగా, ఈ సంవత్సరం వాటి సంఖ్య 224కు చేరింది. గతేడాది 191 మంది ప్రాణాలు కోల్పోగా వాటి సంఖ్య ఈఏడాది 171కు తగ్గింది. కట్నం వేధింపులు తాళలేక గతేడాది 16 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈఏడాది 13 మంది బలవన్మరణం చెందారు. మహిళలపై వేధింపుల కేసులు కాస్త తగ్గాయి. వాటిసంఖ్య 351 నుంచి 323కు తగ్గింది. అత్యాచారం కేసులు పెరిగిపోయాయి. గతేడాది 30 కేసులు, ఈఏడాది 51 కేసులు నమోదయ్యాయి. వరకట్నం వేధింపుల కేసులు గత ఏడాది 152, ఈ సంవత్సరం 157 నమోదయ్యాయి. జిల్లా పరిధిలో పోలీసుల నిర్భయ చట్టం కింద 15 కేసులు నమోదు చేశారు.
45 శాతం రికవరీ..
గడిచిన ఏడాది 233 ఆస్తి చోరీ కేసులు నమోదవగా, 2014 లో 259 కేసులు నమోదయ్యాయి. సంఘటనలకు పెరిగాయి. ఈఏడాది చోరీ కేసుల్లో పోలీసులు 45 శాతం ఆస్తిని రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే గత నవంబర్ వరకు జిల్లా పరిధిలో పోలీసులు ఎంవీ యాక్టును ఉల్లంఘించిన 29830 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ 35,14,130 జరిమానా వసూలు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
మొయినాబాద్: అశ్లీల కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన రిసార్టులు, ఫాంహౌస్‌లపై ఈఏడాది సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలు రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలను భగ్నం చేశారు. నగరంలో పోలీసులు నిఘా పెరగడంతో యువత కన్ను శివారు ప్రాంతాలైన మొయినాబాద్, నార్సింగి, మేడ్చల్, శామీర్‌పేట్, జవహర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలపై పడింది. కొన్ని రిసార్టులు, ఫాంహౌస్‌లలో తరచూ రేవ్ పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల చిలుకూరు సమీపంలో ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
సైబరాబాద్ పోలీసుల కొత్త ఆలోచన ‘కార్డన్ సెర్చ్’
ఈ సంవత్సరం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కొత్తగా ‘కార్డన్ సెర్చ్’ ప్రారంభించి రౌడీషీటర్లు, నేరగాళ్ల ఆటను కట్టడి చేశారు. కమిషనరేట్ పరిధిలోని కాటేదాన్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రొఫెసర్ దురాఘతం..
మేడ్చల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2014లో మూడు కేసులు తీవ్ర సంచలనం రేపాయి. గత అక్టోబర్ 6న ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్ కుటుంబ కలహాలతో తన ఇద్దరు కొడుకులు విఠల్ విరంచి, నంద విహారిలను దారుణంగా చంపేసి మేడ్చల్ శివారులోని తన ప్లాట్‌లో గుంత తవ్వి పూడ్చివేశాడు. అనంతరం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అక్టోబర్ 24న హనీబర్గ్ రిసార్టులో నైజీరియా దేశస్తులు పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మరో ఘటనలో ఓ ప్రబుద్ధుడు మహిళను పెళ్లి చేసుకుని ఆమె కూతురు(14)ను గర్భవతిని చేశాడు. పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు. మేడ్చల్ ఠాణా పరిధిలో ఈఏడాది 4 హత్య కేసులు, 4 అత్యాచారం కేసులు, 93 చోరీ కేసులు నమోదయ్యాయి.
చైన్‌స్నాచర్ శివ ఎన్‌కౌంటర్..
శంషాబాద్: కరడుగట్టిన చైన్‌స్నాచర్ శివ ఎన్‌కౌంటర్, పట్టణంలోని ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌లో జరిగిన జంట హత్యలు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించాయి. గతేడాది ఆర్‌జీఐఏ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ సంవత్సరం 33 మంది చనిపోగా మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాలు ఎక్కువగా ఔటర్‌రింగు రోడ్డుపైనే జరిగాయి. కాగా శంషాబాద్ పట్టణంలో పట్టపగలే జరిగిన పలు చోరీలు పోలీసులకు సవాళ్లు విసిరాయి. అయితే గతంతో పోలిస్తే సొత్తు రికవరీలో ఆర్‌జీఐఏ పోలీసులు భేష్ అనిపించుకున్నారు. గతేడాది రికవరీ 67 శాతం ఉండగా ఈఏడాది ఇప్పటి వరకు 80 శాతం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు అత్యాచార కేసులు నమోదయ్యాయి.
సంచలనం రేపిన శివ ఎన్‌కౌంటర్
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300లకు పైగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన శివను సీసీఎస్ పోలీసులు గత ఆగస్టు 16న రాత్రి శంషాబాద్ ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రహదారిపై ఎన్‌కౌంటర్ చేశారు. గత మార్చి 23న రాత్రి శంషాబాద్ నడిబొడ్డున ఉన్న ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ దోపిడీకి వచ్చిన దుండగులు సెక్యూరిటీగార్డుతో పాటు మరో వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. శంషాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మహిళలకు కల్లుతాగించి సొమ్ముదోచుకుని హత్యచేసిన ముగ్గురు సభ్యులున్న ముఠాను ఆర్‌జీఐఏ పోలీసులు మార్చి 27 రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా మొత్తం ఐదుగురు మహిళలను హతమార్చింది. ‘బియాస్’ దుర్ఘటనలో శంషాబాద్‌కు చెందిన అరవింద్ మృతి చెందడంతో స్థానికంగా అప్పట్లో విషాదం అలముకుంది.
25 కేజీల బంగారం పట్టివేత..
బంగారం అక్రమ రవాణా కేసులు ఈఏడాది తొలిమూడు నెలల్లో భారీగా నమోదయ్యాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు కస్టమ్స్ అధికారులు సుమారు 25 కేజీలకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.