గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 101 ప్రాంతాలలో కౌంటర్లు, టెంట్లు, మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేశామన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీం, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్‌లతో మూడు విడతల వారీగా అందుబాటులో ఉండేవిధంగా సిబ్బందిని కేటాయించామని, ప్రతి సర్కిల్‌లో ఒక ఎమర్జెన్సీ టీంను 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.
దాదాపు 800 వీడియో కెమెరాల ద్వారా బాలాపూర్ నుండి ట్యాంక్‌బండ్ వరకు జరిగే గణేష్ నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందన్నారు. నిమజ్జనంకోసం ఎన్టీఆర్‌మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్ వద్ద 25, మినిస్టర్ రోడ్డులో 3, రాజన్నబౌలి వద్ద 3, మీరాలంట్యాంక్‌లో 2, ఎర్ర కుంటలో 2 క్రేన్‌లు సిద్ధంగా ఉన్నాయని, అంబులెన్స్‌లు, జనరేటర్లు, వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. శానిటేషన్ నిర్వహణకు దాదాపు 9,710 మందితో 3 విడతలలో పనిచేసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. భక్తులకోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే పరిశుభ్రత కోసం 14 స్వీపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచామని తలసాని చెప్పారు.