సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేష్ కుమార్, ఎన్.శివశంకర రెడ్డి, డాక్టర్.వి.రవీంద్రకు ఐజీలుగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార‍్తికేయ,కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు,ఏ.వెంకటేశ్వరరావుకు డీఐజీలుగా ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. (50 మంది ఐఏఎస్‌ల బదిలీ)
ఐజీలుగా
రాజేష్ కుమార్
ఎన్.శివశంకర రెడ్డి
డాక్టర్.వి.రవీంద్ర
డీఐజీలుగా
కార‍్తికేయ
కె.రమేష్ నాయుడు
వి.సత్యనారాయణ
బి.సుమతి
ఎం.శ్రీనివాసులు
ఏ.వెంకటేశ్వరరావు
కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఐపీఎస్ బదిలీలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. నేడు, రేపు అంటూ ఊరిస్తోన్న ట్రాన్స్‌ఫర్ల ప్రచారంతో పోలీసు అధికారులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 50మంది ఐఏఎస్‌లోను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తర్వాత రోజు ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని భారీగా ప్రచారం సాగింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం కూడా ఇదే తరహా ప్రచారం సాగింది. కొందరు ఔత్సాహికులు ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగి పోయిందంటూ పోస్టింగ్‌లతో సహా సోషల్ మీడియాలో పెట్టేసారు. ఈ సందేశాలు క్షణాల్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.
పలువురికి స్థాన చలనం..
వాస్తవానికి ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు 2018లోనే జరగాల్సింది. కానీ, అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి. దీంతో ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. 2019 ఏప్రిల్‌లో రాష్ట్ర హోంశాఖ కేంద్రం అనుమతితో 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. వాస్తవానికి పదోన్నతితోపాటు బదిలీ తప్పనిసరి. కానీ, వీరికి పదోన్నతి దక్కినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 నెలలుగా తమకు కొత్త పోస్టింగ్‌లు వస్తాయని ఎదురు చూశారు.
12 మంది ఐపీఎస్‌లు నగరానికి..!
ఇక జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న దాదాపు 12 మంది ఐపీఎస్ అధికారులను నగరానికి తీసుకురావాలన్న యోచనలో డీజీపీ ఉన్నట్లు సమాచారం. వీరికి గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో, ఇతర రాష్ట్రస్థాయి విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘‘రైట్ పర్సన్ ఎట్ రైట్ పొజిషన్’’ అన్న విధానంలో ఆయన పోస్టింగ్‌లు ఇవ్వనున్నారని సమాచారం. ఎలాంటి పైరవీలకు తావులేకుండా.. పనితీరు ఆధారంగా సరైన స్థానంలో సరైన అధికారికి బాధ్యతలు అప్పజెప్పనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment