
సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం
హైదరాబాద్: వామపక్షాల ఐక్య విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కార్పొరేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగాగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.