
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'
హైదరాబాద్: పేదల ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్దే ఉంటే తన క్యాంప్ ఆఫీసు పక్కనే ఉన్న ఐఏఎస్ అసోసియేషన్ భూముల్లో నిర్మించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ విలేకర్లతో మాట్లాడుతూ... నాలాలు కబ్జాకు గురయ్యాయంటున్న కేసీఆర్... మరి తెలంగాణ భవన్ను నాలాల్లోనే నిర్మించారన్న సంగతి గ్రహించాలన్నారు.
తెలంగాణ భవన్ కోసం కబ్జా చేసిన 170 గజాల భూమిని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను నిర్మించి కేసీఆర్ చిత్తశుద్ధి చాటుకుంటే మరిన్నీ ఇళ్లు నిర్మించేందుకు భూములు చూపిస్తామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం యూనివర్శిటీ భూములు తీసుకుంటామంటే సహించేది లేదని కేసీఆర్ ప్రభుత్వానికి షబ్బీర్ అలీ హెచ్చరించారు.