శ్రీదేవి
మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకసమున హరివిల్లువిరిస్తే.. అది తమ కోసమేనని సంబరపడే చిరుప్రాయం వారిది. చిట్టిచిట్టి మాటలు, బుడిబుడి అడుగులతో అలరించే ఆనందలోకం వారిది. కానీ బుద్ధిమాంద్యం వారి పాలిట శాపంలా మారింది. చదువుకునే వయసొచ్చినా అక్షరజ్ఞానం పొందలేని దయనీయ స్థితి. ఇలాంటి ఎంతోమందిని తన శిక్షణతో విద్యావంతులుగా తీర్చిదిద్ది.. రెండు దశాబ్దాలుగా వారి జీవితాల్లో అక్షరకిరణాలు ప్రసరింపజేస్తున్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీదేవి. బుద్ధిమాంద్యుల జీవితాల్లో ఘనీభవించిన చీకటి తెరలను తొలగిస్తున్నారు. శంకర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి 20 ఏళ్లుగా బుద్ధిమాంద్యులకు విద్యాగంధాన్ని అద్దుతున్నారు. ఇలా ఇప్పటివరకు ఇక్కడ అక్షరాలు నేర్చుకున్న ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తమకు నచ్చిన ఉపాధి మార్గాలను ఎంచుకున్నారంటే ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బుద్ధిమాంద్యం పిల్లల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సేవా తత్పరతను చాటుతున్నారు శ్రీదేవి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న ఆమె తనఅనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : సైకాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బుద్ధిమాంద్యులైన పిల్లలకు చదువు చెప్పడం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో చేరాను. కానీ ఏ సంస్థలోనూ వారికి కొద్దిపాటి అక్షర జ్ఞానం నేర్పిస్తే చాలు ఎంతో గొప్పగా భావించేవారు. బుద్ధిమాంద్యత పిల్లలు ఎప్పటికీ బాగా చదవలేరు. రాయలేరు అనే భావన ఉండేది. వారి కోసం ప్రత్యేక కరిక్యులం రూపొందించి చదివిస్తే అద్భుతాలు చేయవచ్చనిపించింది. ఈ క్రమంలో ఎంతో ఘర్షణకు గురయ్యాను. దీంతో ఏ సంస్థలోనూ మనస్ఫూర్తిగా పని చేయలేకపోయాను. బుద్ధిమాంద్యులకు చదువు చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ కోసం లండన్‌కు వెళ్లాను. ఎక్వల్ రాబర్ట్ అనే నిపుణురాలి వద్ద శిక్షణ తీసుకున్నాను. కొంతకాలం లండన్‌లో ఉన్నా. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు స్థాపించిన శంకర్ ఫౌండేషన్ కేంద్రంగా నా కార్యాచరణ ప్రారంభించాను. ఎక్వల్ రాబర్ట్ గైడెన్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహం నాకెంతో ఉపకరించింది. మొదట 100 మంది పిల్లలను పదో తరగతి పరీక్షలు రాయించాను. ఇందుకు చాలా కాలమే పట్టింది. ఈ 20 ఏళ్లలో 500 మందికిపైగా పిల్లలు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. ఫిజియోథెరపిస్టులుగా, హార్డ్‌వేర్ నిపుణులుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఈ విజయం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది.
మూడు అనుబంధ సంస్థలతో ఉపాధి..
శంకర్ ఫౌండేషన్ ద్వారా విద్యనభ్యసించిన వాళ్లకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా తల్లుల కమిటీలను కూడా ఏర్పాటు చేసి భాగస్వాములను చేశాం. బేగంపేట్ కేంద్రంగా ‘శ్రద్ధ సబూరి’ పని చేస్తోంది. ఇక్కడ రకరకాల థెరపీలు, ఆక్యుపంక్చర్ వంటి చికిత్సలు అందజేస్తున్నాం. పేపర్ ప్లేట్లు, కోల్డ్‌ప్రెస్ ఆయిల్, సబ్బులు, జ్యూట్ బ్యాగులు వంటివి తయారు చేసి విక్రయించడం ద్వారా పిల్లల నుంచి వారి కుటుంబాలకు ఆదాయం అందుతోంది. ఖైరతాబాద్ కేంద్రంగా ‘సమర్థ సహకార్’ పని చేస్తోంది. ఇది కూడా ఒక స్థాయి ఉపాధి శిక్షణ కేంద్రమే. కోహెడలో బుద్ధిమాంద్యులైన వారి తల్లిదండ్రులు, కుటుంబాలతో కలిసి ఉండేవిధంగా ‘సన్నిధి సాంత్వన’ ఏర్పాటు చేశాం. ఇది ప్రత్యేక వసతులతో కూడిన గృహ సముదాయం. బుద్ధిమాంద్యులైన పిల్లల కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి చదివిస్తున్న సంస్థ మాది. ఫలితాలు కూడా అలాగే లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment