Interesting And Rare Facts About Kurnool Bethamcharla Native Bimbisara Child Artist Sridevi - Sakshi
Sakshi News home page

Child Artist Sridevi: అదరగొడుతున్న బేతంచెర్ల చిన్నారి.. బింబిసారలో శార్వరిగా

Published Tue, Aug 30 2022 11:57 AM | Last Updated on Tue, Aug 30 2022 1:12 PM

Bethamcharla Kurnool Bimbisara Child Artist Sridevi Special Artcile - Sakshi

సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): చిన్న వయస్సులోనే బుల్లి తెరతోపాటు వెండి తెరపై రాణిస్తూ ప్రతిభ చాటుకుంటోంది బేతంచెర్లకు చెందిన శ్రీదేవి. సీరియల్స్, సినిమాల్లో చక్కన నటన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 10 సినిమాలు, 15 టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులో తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తోంది. ఈటీవీలో ప్రారంభమైన యమలీల తరువాత  సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె కావడం గమనార్హం. 

శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్‌ కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమలో స్థిరపడి కంజుల ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌గా    పనిచేస్తున్నాడు. పలు సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి. ఈ చిన్నారి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. 



నటించే అవకాశం ఇలా.. 
శ్రీహరి గౌడ్‌ 18 సంవత్సరాలుగా సినీరంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. జీ తెలుగు వారు పున్నాగ టీవీ సిరియల్స్‌ తీస్తున్న నేపథ్యంలో చిన్నారి  పాత్ర అవసరం ఉండటంతో తన కూతురు శ్రీదేవిని వారికి పరిచయం చేశాడు. మొదట పున్నాగ సిరియల్స్‌లో కథానాయకుల కుమార్తెగా, కథనాయికల కుమార్తెగా నటించే అవకాశం దక్కింది. కెమెరా ముందు ఎలాంటి బెరుకు, తడబాటు లేకుండా ఆయా సన్నివేశాల్లో చక్కగా నటించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఆ సీరియల్‌లో నటిస్తుండగానే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కళ్యాణ వైభోగం ఇలా 15 టీవీ సీరియల్స్‌లో నటించే ఆఫర్స్‌ వచ్చాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రీదేవి బాలనటిగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న సరికొత్త ధారావాహిక యమలీల, ఆ తరువాత బాలనటిగా పలు పాత్రలను పోషిస్తోంది. సీరియల్స్‌లోనే కాకుండా సీని రంగంలోనూ నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట ఆర్డీఎక్స్‌ లవ్‌ చిత్రంలో బాలనటిగా నటించింది. కథనాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ చిన్నప్పటి పాత్రలో శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత సూపర్‌మచ్చి సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కుమార్తెగా రాణించింది. అడవి శేషు నటించిన మేజర్, రవితేజ నటించిన రామారావు అన్‌డ్యూటీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన బింబిసార సినిమాలో శార్వరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా చిత్రాల్లో బాలనటిగా రాణిస్తూ సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోది. 

మరికొన్నింట్లో అవకాశం  
శ్రీదేవి నటన, అభినయానికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటివరకు నటించిన సినిమాలు, సీరియల్స్‌ కాకుండా మరికొన్నింటిలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో శ్రీదేవి నటించనున్నట్లు తండ్రి శ్రీహరి గౌడ్‌ తెలిపారు. సినిమా రంగంతో పాటు టీవీ ప్రకటనల్లోనూ నటిస్తూ బేతంచెర్ల కీర్తి ప్రతిష్ఠలు చాటుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement