అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు ఆమె.. అమ్మతో పోటీ పడే సౌందర్యం..అమ్మలాగే రాణించాలనే తపన.. అందుకు తగ్గట్టు అంకితభావం.. బాలివుడ్‌లో అరంగేట్రం చేసిన దగ్గర్నుంచీ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న స్టార్ డాటర్... ‘జాన్వీ కపూర్’..నగరం వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా జాన్వీ ‘సాక్షి’తో ముచ్చటించింది. బాలీవుడ్‌లో చేస్తున్నప్పటికీ నేనెప్పుడూ దక్షిణాది అమ్మాయినేనంటూ తను పంచుకున్న కబుర్లు ఆమె మాటల్లోనే...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీతో ఎన్నో అందమైన జ్ఞాపకాలున్నాయి. సిటీలో నాన్న బోనీ కపూర్ సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు ఎక్కువగా వచ్చాను. ఇక్కడ షూటింగ్ అయిపోగానే నేరుగా తిరుపతి వెళ్లడం అలవాటు. ప్రస్తుతం ఇక్కడ సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఎంతో మార్పు వచ్చింది. విశిష్టమైన సంస్కృతి ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి అనుబంధం ఉన్న నగరానికి చాలా కాలం తరువాత వచ్చి టాప్ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్‌తో కలిసి బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చింది.
దేశమంతా దక్షిణాది వైపే చూస్తోంది...
ప్రస్తుతం దేశమంతా దక్షిణాది సినిమాల వైపే చూస్తుంది. నా వారసత్వపు మూలాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. అందుకే నేనెక్కడున్నా, ఏ సినిమాలు చేస్తున్నా దక్షిణాది అమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను. అమ్మ తెలుగులో మరుపురాని సినిమాల్లో నటించి ఇక్కడ ఆరాధ్యనటి అయింది. నాకు కూడా టాలీవుడ్‌లో మంచి ప్రాజెక్ట్ చేయాలనుంది. మంచి కథలకు, దర్శకులకు ఇక్కడ కొదవలేదు. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తాను. దక్షిణాది సినిమాలు, ఇక్కడి సంస్కృతి గురించి ఎక్కడైనా గొప్పగా విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది.
క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా...
సినిమాల వల్ల మాత్రమే వచ్చే గౌరవం, నమ్మకం చాలా ప్రత్యేకమైనవి.ఒక సినిమాతో మరో సినిమాను పోల్చలేం. దేనికదే ప్రత్యేకతను కలిగిఉంటాయి. కళపైన మక్కువ, నిరంతర కృషి, అంకితభావం మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయని గట్టిగా నమ్ముతాను. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న నా తదుపరి సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాలో పాత్రను ఛాలెంజింగ్‌గా చేస్తున్నాను. దీని కోసం క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ క్రమంలో నా రెండు భుజాలకు గాయాలు కూడా అయ్యాయి.
చదవండి: (Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది)
అమ్మే ఫ్యాషన్ గురు..
వ్యక్తిగతంగా ఎలాంటి ఫ్యాషన్ అనుకరించాలి, ఏ విధమైన దుస్తులు ధరించాలనే విషయాల్లో సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను. అమ్మకు ఫ్యాషన్‌పైన మంచి పట్టుండేది. నా సోదరి ఖుషీనీ, నన్ను అందంగా తయారు చేయడంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేది. అధునాతన ఫ్యాషన్ పైన ఎన్నో సలహాలను అందించేది. నా చర్మం చాలా సున్నితమైనది, అందుకే దానికి తగిన ఫ్యాబ్రిక్ మాత్రమే వాడుతాను. సింథటిక్‌కు దూరంగా ఉంటాను. ప్రస్తుతం ఏదైనా సలహా తీసుకోవాలన్నా, ఏదైనా పంచుకోవాలన్నా చెల్లి ఖుషీకే ప్రాధాన్యతనిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment