
మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర
యాదగిరిగుట్ట(నల్లగొండ): మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక గుండెపగిలి మృతి చెందిన వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్రకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాల వద్ద ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అనేకమంది కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే జగన్‌మోహన్‌రెడ్డి నల్లకాలువలో ప్రకటించి సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపట్టారని పేర్కొన్నారు. ఈ యాత్ర జిల్లాలో 9 నుంచి12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 9, 10 తేదీల్లో సాగుతుందన్నారు.
ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. షర్మిల యాత్ర కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన గాదె నిరంజన్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్న, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.