అండగా ఉంటాం.. | Sharmila paramarsha yatra | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం..

Published Wed, Aug 26 2015 2:14 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

అండగా ఉంటాం.. - Sakshi

అండగా ఉంటాం..

సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో పర్యటించారు. ఏడు కుటుంబాలను ఓదార్చారు. ఏడు కుటుంబాల పరామర్శ ముగిసిన తర్వాత మల్కాపూర్‌కు సమీపంలోని జ్యోతినికేతన్ పాఠశాల ఆవరణలో బస చేశారు. రెండో రోజు 78 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగింది.

షర్మిల తమ ఊరికి వస్తున్నారనే సమాచారంతో బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లోని గ్రామాల వారు ఆమెను కలిసేందుకు, చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూశారు. అన్ని ఊళ్లలోనూ గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి వచ్చి షర్మిలకు అభివాదం చేశారు. జనగామలో బస్సు నుంచి షర్మిల దారి పొడవునా అభివాదం చేస్తూ యాత్ర సాగించారు. ఈ సందర్భంలో షర్మిలను దగ్గరగా చూసేందుకు మహిళలు ఉత్సాహంగా కదిలారు.

జనగామ చౌరస్తాలో షర్మిల తన దగ్గరికి వచ్చిన వారికి కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. జనగామలో వైఎస్సార్ సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో షర్మిల రాక సందర్భంగా సందడి నెలకొంది. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో షర్మిలకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. భారీగా వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.  

 అన్ని తెలుసుకుంటూ..
 మహానేత వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో గుడిసెల లచ్చవ్వ కూతురు బాలలక్ష్మి కుటుంబాన్ని మంగళవారం షర్మిల పరామర్శించారు. ఎలా చనిపోయారమ్మా అని షర్మిల అడగ్గా ‘పెద్దాయన ఇమానంలో పోతుంటే చనిపోయాడంటా బిడ్డా. పింఛను ఇచ్చిన దేవుడు లేడట. అంటూ ఫొటో చూసి ఏడ్చింది. కొద్ది సేపటికే గుండెనొప్పి వస్తుందంటూ చెప్పింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయింది’ అని లచ్చవ్వ కూతురు చెప్పింది. బాధపడకండి మా కుటుంబం మీకు అండగా ఉంటుంది అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.

బచ్చన్నపేటలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అలువాల యాదగిరి కుటుంబానికి షర్మిల ధైర్యం చెప్పారు. యాదగిరి పెద్ద కూతురు కల్యాణి తండ్రిని గుర్తుకు చేసుకుంటూ విలపిస్తుంటే షర్మిల దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుంది. యాదగిరి కొడుకు ప్రవీణ్ మెడిసిన్ చదవాలనుకుంటున్నట్లు చెప్పగానే ‘లక్ష్యం పెద్దదే, బాగా చదువు. అనుకున్నది సాధించు. మీకు ఏ కష్టం వచ్చినా. మా కుటుంబం మీకు అండగా ఉంటుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నింపారు. తర్వాత బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నేలపోగుల యాదగిరి ఇంటికి రాజన్న తనయ షర్మిల వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు.

యాదగిరి చనిపోయిన తర్వాత అతని కుమారుడు భాస్కర్ తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసి సెలూన్‌లో పని చేస్తూ వచ్చిన డబ్బులతో తల్లిని పోషిస్తూ, చెల్లిని చదివిస్తున్నాడని తెలుసుకుని భాస్కర్ భుజం తట్టారు షర్మిల. ‘నీకు మంచి కొడుకు ఉన్నాడు. బాధపడకు. అమ్మాయిని మంచిగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మీకు ఏ ఆపద వచ్చినా రాజన్న కుటుంబం ఉందని మర్చిపోవద్దంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన గాదె శంకర్ కుటుంబ బాగోగులను షర్మిల తెలుసుకున్నారు.

45 నిమిషాల పాటు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ‘పిల్లల కోసమైనా దిగులు మానుకుని ఆరోగ్యంగా ఉండాలని, మళ్లీ మంచిరోజులు వస్తాయని, ఏ కష్టం వచ్చినా తనకు ఫోన్ చేయాలంటూ’ షర్మిల ధైర్యం చెప్పారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణానికి చెందిన వల్లాల లక్ష్మీ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న మా మనవరాలు ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోంది’ అని లక్ష్మీ చెప్పింది. ఏ కష్టం వచ్చినా మీకు అండగా నిలబడేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు ఉంటారని షర్మిల భరోసా ఇచ్చారు.

అనంతరం తాటికొండలో ఎడమ మల్లయ్య ఇంటికి చేరుకున్న షర్మిల.. ‘ఆరోగ్యం బావుంటుందా, పిల్లలు బాగా చూసుకుంటున్నారా’ అని అడిగారు. మల్లయ్య భార్య పాపమ్మ పిల్లలు బాగానే చూసుకుంటున్నారని చెప్పింది. ‘మీరు, మా ఇంటికి వస్తారని కలలో కూడా అనుకోలేదంటూ’ మల్లయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. క్రిష్ణాజీగూడానికి చెందిన జక్కుల కొమురమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. షర్మిలను చూడగానే జక్కుల వీరయ్య ‘అమ్మా.. ఈ ముసలోడు ఎలా ఉన్నాడో చూసి రమ్మని మా ఇంటికి నిన్ను ఆ మహానేత పంపించాడా? పంపించాడా అంటూ’ బోరున విలపించాడు. ‘మీరు ఆందోళన చెందవద్దని, అన్ని విధాల ఆదుకుంటానని షర్మిల ధైర్యం చెప్పారు.
 
 బుధవారం ఏడు కుటుంబాలు
 పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య కుటుంబాన్ని మొదట పరామర్శిస్తారు. ఇదే మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ ఇంటికి వెళ్తారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో మద్దెల గట్టయ్య, దోమ లింగయ్య, బస్కుల సుధాకర్ కుటుంబాలను పరామర్శిస్తారు.

తర్వాత వర్ధన్నపేట మండలం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. మూడో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో 82.5 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement