షర్మిల రోడ్‌షో సక్సెస్
- మూడు సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం
- వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
- సీపీఎంకు సంపూర్ణ మద్దతు
- అడుగడుగునా ప్రజల బ్రహ్మరథం
- వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన రోడ్‌షోకు ఓరుగల్లు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దివంగత మహానేత తనయకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట సెగ్మెంట్లలో ఆమె శనివారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాలుగు సెంటర్లలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమర్‌హై... జై జగన్... అనే నినాదాలతో ఆయూ సెంటర్లు మార్మోగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, సీపీఎం అభ్యర్థులను ఆదరించి.. ఆశీర్వదించాలని షర్మిల పదేపదే విన్నవించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. వైఎస్సార్ హయంలో రాష్ర్ట అభివృద్ధి, సంక్షేమానికి చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు అందజేసిన తీరును వివరించారు. అభయహస్తం, ఉపాధి హామీ, ఉచిత విద్యుత్, రుణమాఫీ, డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందజేశారని గుర్తు చేశారు. కరెంట్ చార్జీలు పెంచకుండా.. ఒక్క రూపాయి అదనపు భారం వేయకుండా.. ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్ అనేక పథకాలను అమలు చేసి.. వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే... రైతులకు చేపట్టనున్న స్థిరీకరణ నిధి, అమ్మ ఒడి పథకం వంటివి వందకు వంద శాతం అమలు చేసి తీరుతామన్నారు. ఎవరెన్ని ప్రలోభావాలకు గురిచేసినా... ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని, గుండెల్లో దాచుకున్న రాజన్నను గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ప్రజల ముఖంలో మళ్లీ చిరునవ్వులు పూయాలని వైఎస్సార్ సీపీ భావిస్తోందన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారన్నారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ పథకాలకు ఇక్కడే ప్రాధాన్యం కల్పించారని గుర్తుచేశారు. ఇప్పటికీ 60 శాతం మంది తెలంగాణ ప్రజలు... గొప్ప సీఎంగా వైఎస్సార్‌ను భావిస్తున్నారని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారని.. రాజన్న రాజ్యం తెచ్చేందుకు అందరూ సహకరించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
మరిపెడ టూ నర్సంపేట
ఉదయం 11.15 గంటలకు మరిపెడలో ప్రారంభమైన రోడ్‌షో కురవి, మహబూబాబాద్, గూడూరు మీదుగా నర్సంపేట వరకు సాగింది. సాయంత్రం 7గంటలకు రోడ్‌షో ముగించుకుని ఆమె హైదరాబాద్ వెళ్లిపోయారు. మరిపెడలో రోడ్‌షో ప్రారంభం కాగానే స్థానికులు చేరుకుని షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. రోడ్‌షో సందర్భంగా మధ్య మధ్య జనానికి, చేలల్లో పనిచేసే కూలీలకు షర్మిల అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మరిపెడలో 11.40 గంటలకు రోడ్‌షో ముగిసింది. ఆ తర్వాత కురవి మీదుగా రోడ్‌షో చేపట్టి మధ్యాహ్నం 12.10 గంటలకు ఆమె మహబూబాద్ శివారుకు చేరుకుని మధ్యాహ్న భోజనం చేశారు. విరామం తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్‌షో తిరిగి ప్రారంభం కాగా.. 3.45 గంటలకు మానుకోట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మద్దతుగా ప్రచారం
వైఎస్సార్ సీపీ మహబూబాబాద్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ సుజాత మంగీలాల్, మహబూబాబాద్, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ సీపీఎం అభ్యర్థులు బానోత్ సీతారాంనాయక్, జి.ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా షర్మిల ప్రచారం నిర్వహించారు. ఆయూ సెగ్మెంట్ల అభ్యర్థులతోపాటు ములుగు వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ లోకిని సంపత్ రోడ్‌షోలో పాల్గొన్నారు.
మానుకోటలో పూలతో స్వాగతం
మహబూబాబాద్ సెంటర్‌లో షర్మిలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు పూలతో ఘన స్వాగతం పలికారుు. లంబాడా యువతి బానోతు స్వరూప లంబాడా దుస్తులు బహూకరించగా... షర్మిల వాటిని ధరించారు. ఇక్కడ సీపీఎం శ్రేణులు జతకూడగా.. రోడ్‌షో 4.40 గంటలకు గూడూరుకు చేరుకుంది. సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో నర్సంపేట అంబేద్కర్ సెంటర్‌కు చేరుకోగా... షర్మిల ప్రసంగించారు.
వైఎస్ పథకాలకు తూట్లు
మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక పథకాలకు ఈ ప్రభుత్వాలు తూట్లు పొడిచారుు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎందరో పేదల ప్రాణాలను కాపాడింది. వైఎస్ ఆశయాలను అభిమానించి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మీ ముందుకు వచ్చాను. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. బడుగు, బలహీన వర్గాలకు ఉచిత విద్యతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తాం.
- డాక్టర్ తెల్లం వెంకట్రావు, వైఎస్సార్ సీపీ మానుకోట ఎంపీ అభ్యర్థి
పేదల సంక్షేమమే లక్ష్యం
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేయాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలి. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్.
- సుజాతా మంగీలాల్, వైఎస్సార్ సీపీ డోర్నకల్ అసెంబ్లీ అభ్యర్థి
ప్రజా సేవకులను ఎన్నుకోవాలి
ఈ ఎన్నికల్లో నిజమైన ప్రజాసేవకులను గుర్తించి.. ఎన్నుకోవాలి. గ్రామాల్లో మంచినీరు లేక పేదలు తల్లడిల్లుతున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి.
- బానోతు సీతారాంనాయక్, సీపీఎం మానుకోట అసెంబ్లీ అభ్యర్థి
ప్రజా సమస్యలపై పోరు
ప్రజాసమస్యల సాధనకు ముందుంటాం. నర్సంపేట నియోజకవర్గంలో పాకాల నీటి సమస్య ఉంది. అధికారంలోకి వస్తే స్థానికంగా మంచినీరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం.
- గాదె ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం నర్సంపేట అసెంబ్లీ అభ్యర్థి
ప్రజాసంక్షేమమే వైఎస్సార్ సీపీ లక్ష్యం
ప్రజా సంక్షేమమే వైఎస్సార్ సీపీ లక్ష్యం. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కష్టనష్టాలు ఎదురైనా ప్రజాభ్యుదయం కోసం పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆదరించాలి.
- ముత్తినేని సోమేశ్వర్‌రావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రజల అభ్యున్నతే ధ్యేయం
ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తాం. సంక్షేమ పథకాలతో వైఎస్సార్... ఓదార్పు యాత్రతో జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలి.
- జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మహబూబాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్
రాజన్న పథకాలకు ప్రాణం పోస్తాం
నర్సంపేట అభివృద్ధికి మహానేత వైఎస్సార్ అండగా నిలిచారు. ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొస్తే రాజన్న పథకాలకు ప్రాణం పోస్తాం.
- నాడెం శాంతికుమార్, నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్